హైదరాబాద్ : ఆ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన 50 రోజులకే వారి ప్రేమ కథ విషాదంతమైంది. అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులకు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26), మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఫేస్బుక్ ద్వారా వీరి పరిచయం మొదలైంది. ఇద్దరూ హైదరాబాద్‌లోనే సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 10న పాట్నాలో వివాహం చేసుకున్నారు. అనంతరం మియాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు.
పెళ్లయిన కొన్ని రోజుల నుంచే నీరజ్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం కింద బంగారం, వజ్రాభరణాలు, నగదు తీసుకురావాలంటూ ఇషికను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇషిక ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. బంధువులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా తమ కుమార్తె మృతికి ఆమె భర్త నీరజ్ వేధింపులే కారణమని ఇషిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.