జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలపై పోరాడుతున్నామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం చెప్తూ వస్తున్నది. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం.. ఢిల్లీ పెద్దలే మా బాసులు.. సోనియా దీవెనలు, రాహుల్ ఆశీస్సులు ముఖ్యం అంటూ బడి పిల్లోడు పాఠం అప్పగించినట్టు వీరాధి వీర విధేయతను చాటుకునే కాంగ్రెస్ నేతలు, సీనియర్మోస్ట్ లీడర్లు కొందరైతే.. ఇవే మాటలు చెప్తూ నటిస్తున్నవారు మరికొందరు. ఇలాంటి రెండు బ్యాచ్‌లు కాంగ్రెస్‌లో ఉన్నాయని రాజకీయ పరిణామాలను బట్టి అర్థమవుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందులో ఏ కోవకు చెందుతారో అనేది బహిరంగ రహస్యమే.
జాతీయ స్థాయిలో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై సమరశంఖం గట్టిగా పూరిస్తున్నట్టు రాహుల్‌గాంధీ అడపాదడపా చెప్తూనే ఉన్నారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం.. రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తూ.. బీజేపీ పాట పాడుతున్నట్టు వ్యవహరిస్తున్నారు. బడే భాయ్ భజన చేస్తూ రాహుల్‌కు తలనొప్పిగా మారారని కాంగ్రెస్ పార్టీలోనే చర్చ నడుస్తున్నది. ఇప్పుడు జమిలి ఎన్నికలపై రేవంత్ స్వరంతో కొత్త జగడం తోడయింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లయింది. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేండ్ల పూర్తి కాలం ఉంటారా? కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం నాటకాల్లో రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు మాదిరిగా ఎవరైనా వస్తారా అనే చర్చ నడుస్తున్నది. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం తాను ఐదేండ్లు మాత్రమే కాదు.. పదేండ్లు ఉంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. తానే రాజు, తానే మంత్రి అని ఒంటెత్తు పోకడలు పోతున్నారు. కాంగ్రెస్‌లో రగులుతున్న అంతర్గత కుంపట్లలో ఈ మాటలతో మరింత ఆజ్యం పోసినట్టయింది. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అంటూ కాంగ్రెస్ నేతలే నిలదీశారు. పదవులపై ఎవరికి వారు ప్రకటనలు చేసుకోవడం కాంగ్రెస్ సం స్కృతి కాదని నిప్పులు చెరిగారు. ఢిల్లీ పెద్దలు కూడా అక్షింతలు వేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అబ్బే.. నేను అలా అనలేదు అంటూ రే వంత్‌రెడ్డి నాలుక మడతపెట్టారు. ముఖ్యమంత్రి పదవి ఐదేండ్లు ఉంటదో ఉండదో తెలియని రేవంత్‌రెడ్డి.. కొత్తగా ఐదున్నరేండ్ల లెక్క చెప్తున్నారు. ఇదెక్కడి లెక్క అనుకునే సందేహం కలుగకమానదు. ఇది బీజేపీ చెప్తున్న ‘జమిలి’ లెక్క.
2023 డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచీ తాను పదేండ్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఉంటానని అనేక వేదికలపై, ఇంటర్వ్యూల్లో రేవంత్‌రెడ్డి ప్రకటిస్తూనే ఉన్నారు. 26 నెలల కాంగ్రెస్ పాలన చూస్తూ, ‘రేవంత్ మార్క్’ విధ్వంస విధానాలు గమనించిన తర్వాత కూడా అసలు కాంగ్రెస్ మళ్లీ గెలవడం కాదు కదా, కనీసం పరువు నిలుపుకొనే సీట్లు అయినా సాధిస్తుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
గతంలో 1990 మార్చిలో మొదటిసారి బిహార్ సీఎంగా పదవి చేపట్టిన లాలూప్రసాద్ యాదవ్.. 20 ఏండ్లు సీఎంగా ఉంటానని చెప్పుకొన్నారు. 1995లో రెండోసారి గెల్చినప్పటికీ దాణా కుంభకోణంలో సీబీఐ అరెస్టుకు రంగం సిద్ధం చేయడంతో 1997లో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత లాలూ జైలు పాలయ్యారు. మరోవైపు సుదీర్ఘ కాలం సీఎం పదవిలో ఉన్నవారు చాలామంది, తాము అలా ఉంటామని అహంభావంతో, గర్వంతో చెప్పుకోలేదు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాలు మూడే మూడు. తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్. మూడు చోట్ల కూడా హామీలు భస్మాసుర హస్తాలై ఆ పార్టీ పరిస్థితులు తిరోగమనంలోనే ఉన్నాయి. ప్రజావ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ మార్క్ కుంభకోణాలు చూసి.. మోసపోయినట్టు ప్రజలు గ్రహించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎడతెగని పోరు సలిపిన బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు రెండుసా ర్లు పట్టం కట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2019 లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి జయభేరి మోగించారు. 2018 డిసెంబర్లో రెండోసారి కేసీఆర్ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఈ కారణంగా 2023 నవంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రకరకా ల హామీలు, దుష్ప్రచారంతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టడంతో, అధిష్ఠా నం పెద్దలు కూడా గ్యారెంటీ కార్డుల పేరుతో గారడీ చేయడంతో… బొటాబొటి ఓట్ల శాతంతో గెలిచింది. తెరవెనుక చంద్రబాబు ఆశీస్సులు, రాహుల్ మద్దతుతో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు.
ఇక ఇటీవల రేవంత్‌రెడ్డి ప్రకటనలు చూ స్తుంటే ఆయన గాలిమేడలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతున్నది. అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి 2029 వేసవిలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్తూ వస్తున్న ది. ఆ లెక్కను బట్టి రేవంత్‌రెడ్డి ఐదున్నరేం డ్ల పదవీ కాలం అనుభవిస్తానని చెప్తున్నారన్నమాట. మోదీ చెప్తున్న జమిలి ఎన్నిక లు సాధ్యమని విశ్వాసం ప్రకటిస్తూ, అలా తన పదవి మరో ఆరు నెలలు ఉంటుందని రేవంత్‌రెడ్డి మురిసిపోతున్నారు.
తెలంగాణలో కుం భకోణాలు, అవకతవకల మధ్య కాంగ్రెస్ రెండేండ్ల పాలన గందరగోళంగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ సీఎం ఇలాంటి ప్రకటనలు చేయడంలో విశేషమేమీ లేదు. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకం. ప్రజాస్వామ్య విరుద్ధమైన జోడు ఎన్నికల విధానాన్ని మెజారిటీ రాజకీయ పక్షాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలు ఇంకా జరగనేలేదు. రాజ్యాంగ మార్పుల అమలు కోసం కేంద్ర సర్కార్ సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదిక ఇవ్వడానికి ఇంకా సమయం కోరగా, కేంద్రం ఇటీవల పదవీకాలం పొడిగించింది. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ చెప్తున్న ‘ఒకే దేశంఒకే ఎన్నికలు’ లక్ష్యం 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎంతవరకు నెరవేరుతుందో చెప్పడం కష్టం. అయినా, తాను ఉన్న పార్టీ అయిన కాంగ్రెస్ చెప్తున్న మాటలకు విరుద్ధంగా రేవంత్‌రెడ్డి జమిలి ఎన్నికలు జరుగుతాయని, తన పదవీకాలం మరో ఆరు నెలలు పెరుగుతుందని బహిరంగ ప్రకటనలు చేయడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి ‘పలు అవసరాలు’ వచ్చినప్పుడు రేవంత్ ‘తగిన రీతిలో’ ఆదుకుంటున్నారని, అందుకే పదవిలో కొనసాగుతున్నారని ఆ పార్టీలోనే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రాజకీయవర్గాల్లో చర్చ సంగతి చెప్పేదేమున్నది. అందుకే అతివిశ్వాసంతో ‘నేనే రాజు, నేనే మంత్రి, నేనే ఐదున్నరేండ్లు సీఎం’ అనుకుంటూ ప్రకటనలు చేసుకుంటున్నారు. గతంలో కొందరు కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం ఇచ్చిన స్వేచ్ఛకు, ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై ‘కొన్ని కారణాల రీత్యా’ ఆధారపడటానికి మధ్య తేడా ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. అదే రేవంత్‌లోని అతి విశ్వాసానికి, ఉత్తర కుమార ప్రగల్భాలకు కారణమని అంటున్నారు. కాంగ్రెస్ వ్యతిరేకించే జమిలి ఎన్నికలు కూడా వచ్చి తీరుతాయని రేవంత్ మాట్లాడటం వింత ప్రవర్తనగా కనిపిస్తున్నదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై సబ్బండ వర్ణాల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్నది. అయినా మరో ఆరు నెలలు అదనంగా పదవిలో ఉండే అవకాశం వస్తుందంటూ రేవంత్ కలల్లో విహరిస్తున్నారు.
– నాంచారయ్య మెరుగుమాల