న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో ‘చలో సంసద్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం ఉద్రిక్తంగా మారడం.. లాఠీఛార్జ్ జరగడం.. టియర్ గ్యాస్ ప్రయోగించడం కూడా జరిగింది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలను కంట్రోల్ చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ విధులు నిర్వహించింది. అయితే ఓ ఆర్ఏఎఫ్ ఆఫీసర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టు వివాదాస్పదం అయ్యింది. సోషల్ మీడియాతో పాటు రాజకీయాల్లోనూ దానిపై చర్చ సాగుతోంది. అసిస్టెంట్ కమాండెంట్ సోనియా షెరావత్(Sonia Sehrawat) ‘సంసద్ మార్చ్’ సమయంలో సెంట్రల్ ఢిల్లీలో విధుల్లో ఉన్నది. అయితే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చనిపోయిన బొద్దింక ఫోటోను పోస్టు చేసింది. బొద్దింకలు వాటికి అవే ఏమీ చేయలేవు.. దేశాన్ని మారుస్తాయా అన్న కామెంట్ చేశారామె. దీంతో ఆ పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ పిక్‌ను ఆమె తన అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై ఆర్ఏఎఫ్ ఆఫీసర్ చేసిన పోస్టు సున్నితంగా లేదని సీజేపీ తెలిపింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆఫీసర్ పోస్టు షాకింగ్‌గా ఉందని, మేం బొద్దింకలమే.. కానీ బొద్దింకలకు చావు లేదని కాక్రోచ్ పార్టీ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది.
ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా షెరావత్ .. ఆ శాఖలో అసిస్టెంట్ కమాండెంట్‌గా చేస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక వింగ్ అది. క్రౌడ్ మేనేజ్మెంట్, అల్లర్లను అదుపు చేసేందుకు ఆర్ఏఎఫ్ విభాగం పనిచేస్తుంది. అయితే సోనియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు సుమారు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసిన పోస్టుపై సీఆర్పీఎఫ్లో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఆమె ఇన్‌స్టా అకౌంట్లో డ్యాన్స్ వీడియోలు, ఫిట్నెస్ కాంటెంట్, ట్రెండింగ్ రీల్స్, వ్యక్తిగత అప్డేట్స్ ఉన్నాయి. యూనిఫాంలో ఉన్న కొన్ని పిక్స్, వీడియోస్ కూడా ఉన్నాయి. విన్ లైఫ్ లైక్ ఏ వారియర్ పోడ్కాస్ట్లో.. తాను హర్యానాలో పుట్టినట్లు షెరావత్ చెప్పింది. అక్కడ అమ్మాయిలకు తక్కువ అవకాశాలు ఉంటాయని, ఆ అనుభవాలతోనే సైనిక దళాల్లో కెరీర్‌ను కొనసాగించాలన్న నిర్ణయం చేసినట్లు ఆమె చెప్పారు. శిక్షణ సమయంలో గాయపడినట్లు చెప్పిందామె. ఆ టైంలో ఆమెకు 52 కుట్లు పడ్డాయి. కానీ రికవరీ తర్వాత కఠినమైన శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపింది.