చరిత్ర మారుతున్నది, కాలం మారుతున్నది, కానీ కొన్ని వికృత రూపాలు మాత్రం మారడం లేదు. మనిషిని మనిషిగా ప్రేమించలేని, తోటి మనిషి గుండె చప్పుడు వినలేని, కన్నీటిని గుర్తించలేని ఒక బధిరాంధకత్వం మన సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నది. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో జరిగిన ఘటన కేవలం ఒక శాంతిభద్రతల సమస్య కాదు. అది మన సామాజిక నైతికతకు తగిలిన లోతైన గాయం.
దైవ దర్శనం కోసం వెళ్లిన ఒక నిరుపేద కుటుంబంపై, కేవలం ఒక చిన్న ప్రశ్నకు సమాధానంగా విరుచుకుపడిన అహంకారం, చివరకు రెండు నెలల పసికందు ప్రాణాన్ని బలి తీసుకోవడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన మాయని మచ్చ. ఆ జాతర ప్రాంగణం భక్తితో నిండాల్సింది పోయి, ఒక అభాగ్యురాలి ఆవేదనతో, ఒక పసిపాప అంతిమ శ్వాసతో నిండిపోయింది. ఇది అధికార గర్వానికి, నిస్సహాయతకు మధ్య జరిగిన అసమాన పోరాటం.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో ఆగస్టు 18న మల్లన్న స్వామి చెంతకు వెళ్లిన గణేశ్, మౌనిక దంపతులకు అది ఒక పవిత్రమైన రోజవ్వాలి. కానీ, అక్కడ కాపలా ఉన్న శక్తులు వంద రూపాయల ఎంట్రీ ఫీజు రూపంలో తమ అహంకారాన్ని ప్రదర్శించాయి. స్థానికులకు ఫీజు లేదన్న నిజాన్ని నిలదీయడమే ఆ కుటుంబం చేసిన నేరమా? ప్రశ్న పుట్టిన చోట అహంకారం పడగ విప్పింది. మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తారా? అన్న గర్వం, అణచివేత గుణం కట్టలు తెంచుకున్నాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒకచోట అన్నట్లు: విద్య లేకపోతే మతి పోయింది, మతి లేకపోతే నీతి పోయింది, నీతి లేకపోతే గతి పోయింది… ఇన్ని అనర్థాలకు కారణం అజ్ఞానమే. ఇక్కడ అజ్ఞానం అంటే అక్షర జ్ఞానం లేకపోవడం కాదు, ఎదుటి మనిషిలోని దైవత్వాన్ని గుర్తించలేకపోవడం. వంద రూపాయల కోసం ఒక నిరుపేద కుటుంబాన్ని కులం పేరుతో దూషించడం, మహిళల జుట్టు పట్టుకుని ఈడ్చడం ఏ రకమైన సంస్కృతి? ఆ అరాచక మూక ఆగడాలకు భయపడి, తన భర్తను వదిలేయాలని ప్రాధేయపడుతూ మౌనిక తన రెండు నెలల పసిబిడ్డను నిందితుల కాళ్ల వద్ద పెట్టింది. ఆ పసిపాపను చూసైనా ఆ రాతి గుండెలు కరుగుతాయని ఆ తల్లి ఆశపడి ఉంటుంది. కానీ, మానవత్వం మంటగలిసిన చోట కనికరం ఎలా ఉంటుంది? ఒక కర్కశమైన కాలు ఆ పసిగుడ్డును తన్నింది. ఆ కాలితన్నుకు ఆ చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. దేవుడి సన్నిధిలో జరగాల్సిన జాతర.. ఒక పసిపాప అంత్యక్రియలకు వేదికైంది.
భారతదేశానికి రాజ్యాంగం అనే కవచాన్ని తొడిగిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఒక హెచ్చరిక చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దానిని అమలు చేసే వ్యక్తులు చెడ్డవారైతే అది నిష్ప్రయోజనం అవుతుంది. కుమ్మెరలో జరిగిన ఘటనలో ఈ మాట అక్షర సత్యమైంది. అక్కడ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు మూగప్రేక్షకులుగా మిగిలిపోయారు. అగ్రకుల నేతల అండ చూసుకుని రెచ్చిపోతున్న నిందితుల వైపు నిలబడ్డారు తప్ప, బాధితులకు అండగా నిలువలేదు. పైగా బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతామన్న బెదిరింపులు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఖాకీ చొక్కా వెనుక దాగి ఉన్న పక్షపాతం చట్టబద్ధమైన పాలనకు గొడ్డలి పెట్టు. చట్టం అనేది సామాన్యుడికి రక్షణ కవచం కావాలి కానీ, బలవంతుడి చేతిలో ఆయుధం కాకూడదు. మనం ఎటు వెళ్తున్నాం? చంద్రుడి మీదకు రోవర్లను పంపుతున్నాం కానీ, పక్కవాడి గుండె కోతను వినలేకపోతున్నాం. ఒక తల్లి తన పసిపాప శవాన్ని గుండెలకు హత్తుకుని రోదిస్తుంటే, అధికార గర్వం ఇంకా సింహాసనాల మీదే ఊరేగుతున్నది. ఈ గాయం కేవలం గణేశ్ కుటుంబానిది మాత్రమే కాదు. సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరిదీ. పసిపాప మరణం ఒక భౌతిక మరణం మాత్రమే కాదు, అది మన సామాజిక చైతన్యానికి సంభవించిన మరణం.
మనిషి ప్రాణం కంటే వ్యవస్థలు, అధికారా లు, అహంకారాలే మిన్న అనుకున్నప్పుడు ఆ సమాజం పతనం అంచున ఉన్నట్టే లెక్క. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను కేవలం ఒక ‘లా అం డ్ ఆర్డర్’ సమస్యగా చూడకూడదు. ఇది ఒక సామాజిక వ్యాధి. దీని నిర్మూలనకు సమగ్ర దృక్పథం, చిత్తశుద్ధితో బహుముఖమైన గంభీర కృషి చేయాలి. ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్త పెళుసు ప్రభుత్వానికి అంత వివేకం, విచక్షణ లేకపోయినా చెప్పటం మన ధర్మం.
మనిషి ప్రాణం కంటే వ్యవస్థలు, అధికారాలు, అహంకారాలే మిన్న అనుకున్నప్పుడు ఆ సమాజం పతనం అంచున ఉన్నట్టే లెక్క. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను కేవలం ఒక ‘లా అం డ్ ఆర్డర్’ సమస్యగా చూడకూడదు. ఇది ఒక సామాజిక వ్యాధి. దీని నిర్మూలనకు సమగ్ర దృక్పథం, చిత్తశుద్ధితో బహుముఖమైన గంభీర కృషి చేయాలి. ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్త పెళుసు ప్రభుత్వానికి అంత వివేకం, విచక్షణ లేకపోయినా చెప్పటం మన ధర్మం.
కఠిన శిక్ష: నిందితులపై హత్యా నేరం నమోదు చేయాలి. రాజకీయ అండదండలు ఉన్నాయని ఉపేక్షించకుండా, చట్టం ముందు అందరూ సమానులేనని నిరూపించాలి. వ్యవస్థల ప్రక్షాళన: విధుల్లో నిర్లక్ష్యం వహించి, నిందితులకు కొమ్ముకాసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పక్షం పేరు చెప్పుకొని అరాచకాలు చేసే వారికి ఇది ఒక గుణపాఠం కావాలి.
బాధిత కుటుంబానికి భరోసా: ఆ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. పోయిన ప్రాణాన్ని ఏ సంపదా తిరిగి తీసుకురాలేదు. కానీ వారి జీవన పోరాటంలో ప్రభుత్వం బాధ్యతగా, అండగా నిలువాలి. కేవలం చట్టాలు మారితే సరిపోదు, మనుషుల ఆలోచనా విధానం మారాలి. సామాజిక సంకుచిత్వం అంతరించేలా ఒక విలువల విప్లవం రావాలి. జాతరలు అంటే జంతు బలులు ఇచ్చేవి కాదు, మనిషిలోని క్రూరత్వాన్ని బలి ఇచ్చేవి కావాలి. ఆ పసిపాప ప్రాణం ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్నది. ఆ నిశ్శబ్దపు కేకను వినగలిగే హృదయం మనకు ఉన్నదా? రేపటి సమాజంలో ఏ పసిపాప కూడా అహంకారపు కాలి తన్నులకు బలి కాకూడదు. అప్పుడే మనం ఒక నాగరిక సమాజంగా తలెత్తుకుని నిలబడగలం.
– దేశపతి శ్రీనివాస్