Sonia Gandhi : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ కంటికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఈ సర్జరీ నుంచి కోలుకున్న సోనియా గాంధీ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. న్యూఢిల్లీలోని తన నివాసమైన10 జన్‌పథ్‌కు చేరుకున్నారు.
కొద్ది రోజులుగా సోనియా అనారోగ్యంపై చాలా ప్రచారం జరిగింది. ఆమెకు ఏమైంది అనే విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇదే సమయంలో ఇటీవల న్యూఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరినట్లు ప్రచారం జరిగింది. ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా సోనియా గాంధీని ఆస్పత్రిలో కలిసి వచ్చారు. అయితే, సోనియా గాంధీకి కంటి ఆపరేషన్ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. ఈ ఆపరేషన్ తర్వాత కొద్ది రోజులపాటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోనియా చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఆమె లంగ్స్, శ్వాస సంబంధిత సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి, షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రి సహా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. తాజాగా కంటికి శస్త్ర చికిత్స పూర్తైనా ఇంకొంతకాలం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం.