ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం జరిగిన సంఘర్షణలో..అటవీ సంపద ఆదివాసీలకే దక్కాలని, వారి భూముల పరాయీకరణకు ఉద్దేశించిన 1/70 చట్టాన్ని నిలదీసి నిగ్గుతేల్చాడు ఆచార్య బియ్యాల జనార్దన్‌రావు. ‘గిరిజన భూముల పరాయీకరణ’ అనే అంశంపై ఆయన పీహెచ్డీ కూడా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆదివాసీల ఆపద్బాంధవుడిగా అడుగు వేశారు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో అడుగుల సవ్వడితో సంకలో సంచితో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి తన తొలి అడుగులను ప్రారంభించి, అడవి అంతా కలియతిరిగారు.
1984లో కాకతీయ యూనివర్సిటీ లెక్చరర్‌గా చేరిన తర్వాత వి ద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ప్రత్యేకమైన శైలి ఉండాలని నిరూపించుకున్నారు. అప్పటి నుంచి పాఠాలు చెప్పడం, పరిశోధన చేయడం, ప్రజా ఉద్యమాలతో దోస్తీ చేయడం అనే మూడు విభాగాలుగా తన జీవితాన్ని విభజించుకున్నారు. ఈ విభజనలో ప్రాధాన్యతలు మారాయి గానీ విషయాలు మాత్రం మారలేదు. 80వ దశకంలో పరిశోధనకే ప్రాధాన్యతనిస్తే, 90వ దశకంలో ప్రజాస్వామ్య భావజాలం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. 1996 నుంచి తెలంగాణ ఉద్యమంలో మునిగిపోయారు. ఈ మొత్తం నడకలో అధ్యయన ఫలితాలను రాబట్టడానికి, వాటిని విద్యార్థులకు, ప్రజలకు విడమరచి చెప్పడానికి ఎంతో కష్టపడ్డారు.
పరిశోధకునిగా ఉన్నప్పుడే పౌరహక్కుల ఉద్యమాలకు దగ్గరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఘటనపై నిజనిర్ధారణ కమిటీలో సభ్యునిగా వెళ్లి అరెస్ట్ అయ్యారు. వరంగల్ జిల్లాలో 1982లో కరువుపై పరిశీలన చేసిన బృందంలో జనార్దన్‌రావు ఒకరు. ఇరవై ఏండ్లుగా ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన గూడేల్లోని ప్రజల సమస్యలను అధ్యయనం చేయడమే కాకుండా పరిష్కార ప్రయత్నాలు చేయడం కూడా పనిగా పెట్టుకున్నారు. ఆదివాసీల బతుకుదెరువుల మీద, వారి ఆరోగ్యం మీద, వారిపై జరుగుతున్న అణిచివేతల మీద పోరాటానికి ఆయన ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. ఆదివాసీ సమస్యల మీద ఆయనకు గల అవగాహన అనుబంధాన్ని గుర్తించిన కారణంగానే రాజీవ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్‌లో దక్షిణ భారతదేశం నుంచి కేవలం జనార్దన్‌రావును మాత్రమే ప్రతినిధిగా ఎంచుకున్నారంటే సామాన్య విషయం కాదు. దేశంలోని అన్ని రాష్ర్టాల ఆదివాసీల సమస్యతో పేగు బంధాన్ని పెంచుకున్న వారైనందున..తన మరణానికి రెండేండ్ల ముందు ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తిపై రూపొందించిన ప్రకటన (కోషిమా డిక్లరేషన్)పై సంతకం చేసిన అతికొద్దిమందిలో జనార్దన్‌రావు ఒకడు.
‘తెలంగాణ గత 50 ఏండ్లుగా రక్తం ధారపోస్తున్నది. ఈ తెలంగాణ ఇంకా రక్తం ధారపోసేందుకు నెత్తురు లేదు. ఇక్కడి ఆకలిచావులు, ఆత్మహత్యలు కొనసాగించడానికి వీల్లేదు. దీనికి కారణం నీళ్లు, నిధులు ఆంధ్రాలో ఖర్చు చేయడమే. ఇక్కడి వనరులపై నీళ్లపై, నియామకాలపై తెలంగాణ ప్రజలకు నిర్ణయాధికారం వస్తే తప్ప ఈ మారణహోమం చల్లారదని ఇందుకు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక మార్గం’ అని బలంగా నమ్మాడు. ఈ పనిని సాధించడానికి మేధావులు సంపూర్ణంగా కదలాలని చెప్పడానికి విరామం లేకుండా వారిని ఆ దిశగా ముందుకు సాగేందుకుకు తన వంతు పరితపించారు.
1999 నుండి 2001 వరకు మూడేండ్లపాటు కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో జరిగిన సభలు, సమావేశాల్లో జనార్దన్‌రావు చేసిన ఉపన్యాసాలు అగ్రస్థానంలో నిలిచాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజలు ఏమి కోల్పోయారో, ఎలా కోల్పోయారో వివరించడానికి వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడం, విశ్లేషించడం, ఉపన్యాసం ఇవ్వడం, చర్చించడం, నిర్మాణాలు ఏర్పరచడం, సమన్వయ పరిచేందుకు జనార్దన్‌రావు చెమటోర్చారు.
మహబూబాబాద్ జిల్లా, మునిగలవీడులో 1955 అక్టోబర్ 12న జన్మించిన ఆయన ల్యబర్తి అమ్మమ్మ ఒడిలో పెరిగి, అక్షరాభ్యాసం చేసి, ఓటాయిలో ఓనమాలు దిద్ది, నర్సంపేటలో విద్యనభ్యసించి గోదావరిఖనిలో మేనమామ దగ్గర ఉండి ఇంటర్మీడియట్ చదివి, హనుమకొండ లాల్ బహదూర్ కాలేజీలో డిగ్రీ, విద్యారణ్యపురిలో ఉన్నత విద్యనేర్చాడు. భవితకు పునాది వేసిన ఓరుగల్లులో పోరాట పటిమను పొంది, ఉన్నత శిఖరానికి చేరి ప్రజల తలలో నాలుకయ్యాడు. తెలంగాణ జనగానమై ఆదివాసీ పల్లె కన్నీరు కారుస్తున్నదని ఊహించిన జనార్దన్‌రావు దూరమై నేటికి ఇరవైనాలుగేండ్లు గడిచాయి. ఆదివాసీల పక్షాన గొంతు వినిపించిన ఆయన ఫిబ్రవరి 27న తెలంగాణ ఆదివాసీ ప్రజలకు దుఃఖం మిగిల్చిన రోజు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన ఆయన నేటి విద్యార్థులు, యువకులకు స్ఫూర్తి ప్రదాత.
– శోభ రమేశ్
89786 56327