Sai Srinivas | టాలీవుడ్లో మరో యంగ్ హీరో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా ఈ పెళ్లిని జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే తనకు కాబోయే జీవిత భాగస్వామి కావ్య రెడ్డిని సాయి శ్రీనివాస్ అధికారికంగా పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు కలిసిన వేడుక ఎంతో ఆనందంగా జరిగింది. అయితే అది ఎంగేజ్మెంట్ అంటూ వచ్చిన వార్తలను సాయి శ్రీనివాస్ ఖండించారు. అది కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చిన్న పరిచయ కార్యక్రమమేనని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పుడు అధికారికంగా నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో సాయి శ్రీనివాస్-కావ్యల ఎంగేజ్మెంట్ జరగనుంది. ఈ వేడుకను ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించనున్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. వివాహ వేడుక విషయానికి వస్తే, ఏప్రిల్ 29న తిరుపతిలో సాదాసీదాగా పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఏడుకొండల వాడి సన్నిధిలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవనున్నారు. అనంతరం మే 1న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సెలబ్రిటీ వెడ్డింగ్స్ అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రీ-వెడ్డింగ్ పార్టీలు, బ్యాచిలర్ సెలబ్రేషన్స్ వంటి హంగామా ఎక్కువగా కనిపిస్తున్న వేళ, సాయి శ్రీనివాస్ మాత్రం సింపుల్ వెడ్డింగ్‌ను ఎంచుకోవడం విశేషంగా మారింది. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కావ్య రెడ్డి విషయానికి వస్తే, ఆమెకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ప్రముఖ న్యాయవాది కుమార్తె అయిన ఆమెతో సాయి శ్రీనివాస్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నారు. మార్చి ప్రారంభంలో జరిగిన చిన్న వేడుకలో ఆమెను పరిచయం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక సినిమాల పరంగా చూస్తే, గతేడాది వచ్చిన ‘భైరవం’, ‘కిష్కింధ పురి’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న సాయి శ్రీనివాస్ ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘హైందవ’, లోకమాన్య దర్శకత్వంలో ‘రామమ్’, అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.