Varun Taj | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్లో మరింత వేగం పెంచుతూ వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న యువ దర్శకుడు యదు వంశీతో ఆయన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించనున్నారు. కుటుంబ బ్యానర్లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. మార్చి 28న పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దర్శకుడు యదు వంశీ తన తొలి చిత్రంలో చూపించిన పల్లెటూరి సహజత్వం, భావోద్వేగాల్ని ఈ సినిమాలో మరింత బలంగా ప్రతిబింబించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగుతూ, నేటివిటీకి ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందనుంది. స్నేహం, కుటుంబ విలువలు, భావోద్వేగాలు ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ కూడా తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తుండగా, ఈసారి పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నారని సమాచారం.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ అనే హారర్-కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే యదు వంశీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. గ్రామీణ కథతో, ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమా మెగా అభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించబోతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.