కొండమల్లేపల్లి, ఆగస్టు 12 : మండల కేంద్రంలోని జేబీ కాలనీలో ప్రిన్సిపాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కల్లు రూపారెడ్డి(48) కొండమల్లేపల్లి పట్టణంలోని నాగార్జున గ్రామర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త కల్లు రాజేందర్‌రెడ్డితో కలిసి ఆమె జేబీకాలనీలోని తమ సొంత నివాసంలో నివసిస్తున్నారు. వారి కుమారుడు అభినవ్‌రెడ్డి హైదరబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతుండటంతో తరచూ అక్కడికి వెళ్తుంటారు. గత శనివారం నుంచి వరుసగా మూడు రోజులు సెలువులుండటంతో భర్త రాజేందర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు.
భర్తకు హైదరాబాద్‌లో పని ఉండటంతో ఒక్కతే మంగళవారం ఉదయం కొండమల్లేపల్లికి వచ్చి పాఠశాలకు హాజరయ్యారు. స్నేహితులు వస్తున్నారని చెప్పి సాయంత్రం 5.30 గంటలకు సమీపంలోనే ఉన్న వారి ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం భర్త రాజేందర్‌రెడ్డి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఇంట్లో అద్దెకుంటున్న వారికి ఫోన్ చేసి భార్యతో మాట్లాడించాలని కోరారు. వారు వచ్చి ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో విషయాన్ని రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ఆందోళనకు గురైన రాజేందర్‌రెడ్డి ఇంటి పక్కనే నివాసముంటున్న చింతపల్లి ఎస్ఐ రాంమ్మూర్తికి ఫోన్ చేసి చెప్పారు. ఎస్ఐ రాంమ్మూర్తితో పాటు చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి భర్త రాజేందర్‌రెడ్డి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ అజ్మీర రమేశ్ డాగ్‌స్వాడ్‌తో పరిశీలించారు.
మృతురాలి కుమారుడు అభినవ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇంట్లో వస్తువులు, నగదు ఏవీ చోరీకి గురికాలేదు. రూపారెడ్డికి పరిచయమున్న వ్యక్తులే ఆమె హత్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, మరేదైనా కారణమా అన్నది తేలాల్సి ఉంది. రూపారెడ్డి మృతదేహంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్థానికులు తండోపతండాలుగా వచ్చి రూపారెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. రూపారెడ్డి హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ నాయినీ జమున మాధవరెడ్డి, ఎంఏ సీరాజ్ ఖాన్, ఉట్కూరీ వేమన్‌రెడ్డి, ఎడుపుల గొవింద్, దొండేటి మల్లారెడ్డి, హరికృష్ణ, కోట్ల జగదీశ్, శ్రీదర్‌గౌడ్ పాల్గొన్నారు.