Khairatabad Bada Ganesh | భాగ్యనగరం ఆధ్యాత్మిక సంద్రమైంది.. భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. శుక్రవారం ఎటు చూసినా గణనాథుల కోలాహలం.. జయజయ ధ్వానాలతో నగరం పులకించిపోయింది. ఖైరతాబాద్ బడా గణేశుడి విమహానిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తుతో కొలువుదీరిన ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ హుస్సేన్‌సాగర్ గంగమ్మ ఒడికి చేరారు. భక్తుల జయజయధ్వానా మధ్య హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న క్రేన్ నంబర్ 4 వద్ద బడా గణేశుడి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది.
ఉదయం 9 : 30 గంటలకు ఖైరతాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ తెలంగాణ తల్లి చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఈ శోభాయాత్ర కొనసాగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు హుస్సేన్ సాగర్‌లో భారీ క్రేన్స్ సాయంతో నిమజ్జనం చేశారు.
ఖైరతాబాద్ గణనాథుడి చివరి రూపాన్ని చూసేందుకు, నిమజ్జన వేడుకను వీక్షించేందుకు రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలకు తరలివచ్చారు. నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు వీలుగా హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడమే కాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా పెట్టారు.