న్యూఢిల్లీ, ఆగస్టు 12 : ధరల సూచీ మరింత భగ్గుమన్నది. ఆహార పదార్థాల ధరలు భగ్గుమనడంతో జూలై నెలకుగాను రిటైల్ ధరల సూచీ 4.45 శాతానికి ఎగబాకింది. ప్రధానంగా ఉల్లి, అల్లంతోపాటు ఇతర ఆహార పదార్థాల ధరలు రిజర్వు బ్యాంక్ అంచనావేసిన దానికంటే అధికంగా ఉండటంతో వరుసగా రెండోనెలలోనూ దూసుకుపోయింది. జూన్ నెలలో రిటైల్ ధరల సూచీ 4.38 శాతంగా ఉంది. గత నెలలో ఆహార ద్రవ్యోల్బణ సూచీ 5.32 శాతం నుంచి 5.52 శాతానికి ఎగబాకినట్టు జాతీయ గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
జూన్ నెలలో 4.73 శాతంగా ఉన్న ఉల్లి ధరల సూచీ ఆ మరుసటి నెలలో ఏకంగా నాలుగింతలు పెరిగి 22.54 శాతానికి ఎగబాకింది. అలాగే అల్లం ధరల సూచీ 83.62 శాతానికి చేరుకోగా..వెల్లుల్లి ధరలు కూడా భారీగా పుంజుకున్నాయి. మరోవైపు, బంగాళాదుంప, బెండకాయ, టమాట ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. రిజర్వుబ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నెల మొదట్లో చమురు, ఆహార పదార్థాల కారణంగానే ధరల సూచీ భారీగా పెరుగనున్నట్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ధరల సూచీ గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. జూలై నెలలో రాష్ట్రంలో ధరల సూచీ 6.32 శాతానికి ఎగబాకింది. మిజోరాంలో అత్యంత తక్కువ స్థాయి 1.84 శాతంగా నమోదైంది. క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ దీప్తి దేశ్పాండే మాట్లాడుతూ..ఆహార పదార్థాల ధరల పెరుగుదల మందగించడం, ఆహారేతర ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండటంతో జూలై నెలకుగాను ద్రవ్యోల్బణ విషయంలో కొంత ఉపశమనం లభించిందన్నారు. ఆహార ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం, అధిక వంటనూనెల ధరలు, జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావంతో క్రమంగా తగ్గుముఖం పట్టిందని, ముఖ్యంగా రవాణా ఖర్చులు వంటి ముడిసరుకుల వ్యయాలు క్రమంగా వినియోగదారులపై పటడం వంటి అంశాలు రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని అంచనావేస్తున్నట్టు చెప్పారు.