AP Nandi Awards | తెలుగు సినీ, టెలివిజన్ రంగాల కళాకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ప్రదానోత్సవాలకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న నంది అవార్డుల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2012–2016 సంవత్సరాలకు సంబంధించిన నంది, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని 2026 నవంబరులో విజయవాడలో నిర్వహించనున్నారు.
అదే సమయంలో 2017–2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి అన్ని విభాగాల్లో అవార్డులు ఇవ్వకుండా కొన్ని ప్రధాన విభాగాలకు మాత్రమే పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాదికి మొదటి ఉత్తమ ఫీచర్ చిత్రం, రెండో ఉత్తమ ఫీచర్ చిత్రం, రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు.. మొత్తంగా నాలుగు పురస్కారాలు ఇవ్వనున్నారు. టెలివిజన్ విభాగంలోనూ ఇదే తరహాలో 2017–2024 సంవత్సరాలకు ప్రతి ఏడాది మొదటి, రెండో ఉత్తమ మెగా సీరియల్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు అందించనున్నారు. అయితే 2025 సంవత్సరం నుంచి అన్ని విభాగాల్లోనూ నంది అవార్డులు అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
2017–2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన నంది ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని 2026 డిసెంబరులో అమరావతి లేదా విజయవాడలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నంది టెలివిజన్ అవార్డుల వేడుకను కూడా అదే నెలలో తిరుపతిలో నిర్వహించనున్నారు. దీంతో 2026 చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న అవార్డుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. 2017–2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన జ్యూరీ కమిటీల ఏర్పాటును పూర్తి చేసి, విజేతల ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. అవార్డు గ్రహీతల జాబితాను నవంబరులో ప్రకటించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కాగా, ఇటీవలే నంది నాటక పురస్కారాలు–2025, కందుకూరి పురస్కారాలు–2026కు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే.