న్యూఢిల్లీ, ఆగస్టు 12 : అపోలో హాస్పిటల్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.610.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.441 కోట్ల లాభంతో పోలిస్తే 38.4 శాతం వృద్ధి కనబరిచింది.
సమీక్షాకాలంలో సంస్థ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.5,842.1 కోట్ల నుంచి రూ.7,043.5 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. వీటిలో హెల్త్‌కేర్ సేవల నుంచి రూ.3,619 కోట్ల ఆదాయం సమకూరగా, డిజిటల్ హెల్త్, ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ నుంచి రూ.2,977 కోట్లు సమకూరాయి. అలాగే రిటైల్ హెల్త్, డయాగ్నోస్టిక్ సెగ్మెంట్ నుంచి మరో రూ.499 కోట్లు లభించాయి.