టెహ్రాన్, మార్చి 27 : అమెరికా, ఇజ్రాయెల్‌తో భూతల యుద్ధం జరగవచ్చని ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో 10 లక్షల మందికిపైగా యోధులను ఇరాన్ సమీకరించినట్లు తెలిసింది. ఈ 10 లక్షల మందిలో సైనిక సిబ్బంది, వలంటీర్లు ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ తాస్నిం వార్తాసంస్థ తెలిపింది. సమీకరించిన ఈ దళాలు భిన్న పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యంతో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్‌జీసీకి చెందిన బసీజ్(వలంటీర్ పారామిలిటరీ ఫోర్స్) నియామక కేంద్రాలు, సైన్యంలో దళాల సంఖ్య పెరిగిందని, దేశాన్ని రక్షించంలో పాలుపంచుకునేందుకు సంసిద్ధత తెలియచేస్తూ భారీ సంఖ్యలో యువ ఇరానియన్లు ముందుకు వచ్చారని వర్గాలు పేర్కొన్నాయి. ఖర్గ్ ద్వీపంలో తన బలగాలను ఇరాన్ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పెంచింది. అదనపు బలగాలతోపాటు గగనతల రక్షణ వ్యవస్థలు, ఆత్మరక్షణ ఉచ్చులను కూడా ద్వీపంలో ఏర్పాటు చేసింది.
ఇరాన్‌కు చెందిన ద్వీపాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేయవద్దని ఇరాన్ పార్లమెంట్ స్వీపకర్ బుధవారం శత్రువులను హెచ్చరించారు. ఇరాన్ శత్రువులు ప్రాంతీయ దేశాలలో ఒకదాని మద్దతుతో ఒక ఇరానియన్ ద్వీపాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ బుధవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. శత్రువుల కదలికలన్నీ తమ సాయుధ దళాల పూర్తి నిఘా పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు. శత్రువులు దుస్సాహసానికి పాల్పడితే వారికి సహకరించిన ఆ ప్రాంతీయ దేశానికి చెందిన కీలక మౌలిక సదుపాయాలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరంతర దాడులకు గురవుతాయని ఆయన హెచ్చరించారు. ప్రాంతంలో అమెరికా కదలికలు ముఖ్యంగా సేనల మోహరింపులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ఘలీబాఫ్ తెలిపారు. ఇలా ఉండగా ప్రపంచ చమురు, గ్యాసు సరఫరాలకు ఏర్పడిన అవరోధాన్ని తొలగించేందుకు హొర్ముజ్ జలసంధిని చేజిక్కించుకోవడంలో తమతో కలసి రావాలని తన మిత్రదేశాలైన నాటో, యూరోపియన్ యూనియన్, ఆసియన్ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పిలుపునిచ్చారు.
ఇరాన్‌తో భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ను జవాన్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఆ దేశ ఆర్మీ చీఫ్ జమీర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన సెక్యూరిటీ క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొన్నది. ‘మీ ముందు నేను పది ఎర్ర జెండాలు (తీవ్ర ప్రమాద పరిస్థితులు) ప్రదర్శిస్తున్నా’ అని ఆయన మంత్రులకు చెప్పినట్టు చానెల్ 13 న్యూస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిర్బంధ సైనిక సేవా చట్టం, రిజర్వ్ డ్యూటీ చట్టం, తప్పనిసరి సేవను పొడిగించే చట్టం అమలు కావాలని జమీర్ కోరినట్టు సమాచారం. మూడేండ్ల క్రితం గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 12 వేల మంది సైనికుల కొరత ఐడీఎఫ్‌ను వేధిస్తున్నది. ఇదే విషయమై ఆ దేశ విపక్ష నాయకుడు యైర్ లపిడ్ గురువారం ఇజ్రాయెల్ సర్కార్‌ను తీవ్రంగా విమర్శించారు. గాయపడ్డ సైనికులను యుద్ధ క్షేత్రంలో అలాగే వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ ఆవిర్భావం నుంచి సైనిక సేవకు మినహాయింపు పొందిన అతి సంప్రదాయ వాద హరేడి వర్గ పురుషులను సైన్యంలో చేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నప్పటికీ పశ్చిమాసియాకు అదనంగా 10,000 బలగాలను పంపాలని అమెరికా యోచిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌లో గురువారం వెలువడిన వార్తను ఉటంకిస్తూ జెరూసలెం పోస్టు పేర్కొన్నది. ఇప్పటికే పశ్చిమాసియాలో నియమించిన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ బలగాలకు అదనంగా ఇన్ఫాంట్రీ, సాయుధ వాహనాలను పంపాలని అమెరికా భావిస్తున్నట్లు యుద్ధ శాఖ అధికారులను ఉటంకిస్తూ జెరూసలెం పోస్టు తెలిపింది. ఖర్గ్ ద్వీపం వంటి ఇరాన్ వ్యూహాత్మక ప్రయోజనాలను నేరుగా లక్ష్యం చేసుకుని 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌ను మోహరించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అదనపు బలగాలను ఎక్కడకు పంపిస్తారన్న విషయమై స్పష్టత లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. బలగాల మోహరింపునకు సంబంధించి అన్ని ప్రకటనలు యుద్ధ శాఖ నుంచి వస్తాయని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ చెప్పారు. సైనిక ప్రత్యామ్నాయలన్నిటిపై తుది నిర్ణయం అధ్యక్షుడు ట్రంప్‌దేనని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఒకరు చెప్పారు.