Kerala Elections | మొదట పంచాయతీ ఎన్నికలు! దాని వెనువెంటే మున్సిపల్ పోరు! సర్వశక్తులూ ఒడ్డినా గుడ్డిలో మెల్లగా గెలిచిన కాంగ్రెస్.. ప్రాదేశిక ఎన్నికలకు వెళ్లాలంటే మాత్రం భయపడుతున్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకతను తట్టుకుని ఎంతోకొంత గెలువాలంటే సుమారు 800 కోట్ల వరకు ఖర్చుచేయాల్సి వస్తదని రాష్ట్ర నాయకత్వం అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ లోగా కేరళ ఎన్నికలు తెరపైకి రావడం, అధిష్ఠానం వెయ్యికోట్ల టార్గెట్ పెట్టడంతో పరిషత్ ఎన్నికలను వాయిదా వేసి, ఆ మొత్తాన్ని కేరళకు పంపేందుకు కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నది. తమ ‘మెడకు డోలు’ను తగిలించడంపై ఇప్పటికే మండిపడుతున్న సీనియర్ మంత్రులు.. ఒక్కొక్కరికి రూ.35 కోట్లు టార్గెట్ పెట్టడంపై రగలిపోతున్నట్టు సమాచారం.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో రూ.1,000 కోట్ల సమీకరణకు వేట మొదలైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నగదు పైసలు వచ్చే ఫైళ్లు ఏమున్నా సరే, క్లియర్ చేయాలని స్వయంగా ముఖ్యనేత ఆదేశాలిచ్చినట్టు చెప్పుకొంటున్నారు. భూ దందాలు, బదిలీలు, పర్మిషన్లు, కమీషన్లు, పంపకాలు ఏముంటే అవి వెంటనే పూర్తిచేసి డబ్బు పోగేయాలని సూచించారని ప్రచారం. మరోవైపు, రాష్ట్రంలో ఖర్చులు తగ్గించుకొని ఆ నిధులను జమచేసి కేరళకు పంపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అందులో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని, ఆ ఎన్నికల కోసం ఖర్చు చేసే డబ్బును కేరళకు తరలించాలని ముఖ్యనేత నిర్ణయించినట్టు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన క్షేత్రస్థాయి క్యాడర్ 19 నెలలుగా ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నది. 2024 జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు కూడా తీరింది.
ఈ రెండు ఎన్నికలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయి. ‘మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన మాకు పదవులు వద్దా?’ అంటూ గ్రామ స్థాయి లీడర్లు.. ఎమ్మెల్యేలతోపాటు మంత్రులను నిలదీస్తున్నారు. దీంతో ఏప్రిల్‌లో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించినట్టు తెలిసింది. అయి తే, కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలకు ముఖ్యనేత గురువునే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, తెలంగాణ నుంచే దాదాపు రూ.1,000 కోట్ల నిధులు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని ముఖ్యనేత నిర్ణయించినట్టు తెలిసింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ నుంచి రూ.1,000 కోట్ల సర్దుబాటు ప్రక్రియ మొదలైనట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ఖర్చులు తగ్గించుకొని నిధులు సమకూర్చాలని ముఖ్యనేత మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఇందులోభాగంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని, ఏప్రిల్‌లో నిర్వహించాలనుకున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
గాంధీ కుటుంబాన్నే నమ్మకొని ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకుతోసేసి, తనకు పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యపీఠం మీ ద కూర్చోబెట్టిన గురువు రుణం తీర్చుకోవాలని బలమైన సంకల్పంతో ముఖ్యనేత ఉన్నట్టు తెలిసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ప్రతిపైసా తెలంగాణ రాష్ట్రమే పెట్టుకుంటుందని ముఖ్యనేత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈనెల 19న తెలంగాణ మంత్రివర్గాన్ని గంపగుత్తగా ఢిల్లీకి పిలిపించిన అధిష్ఠానం రూ.1,000 కోట్ల టార్గెట్ పెట్టినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినా బొటాబొటి సీట్లు వచ్చాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేకత ఇంకా ఎక్కువ ఉన్నదని ముఖ్యనేత సహచర నేతలతో సమాలోచనలు చేసినట్టు తెలిసింది. ప్రాదేశిక ఎన్నికల్లో కనీసం 60% నుంచి 70% ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ స్థానాలు సొంతం చేసుకోవాలంటే, అభ్యర్థులు పెట్టుకునే ఖర్చులే కాకుండా ప్రజాప్రతినిధులు గా తాము కూడా రూ.800 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేత అన్నట్టు తెలిసింది. ఎన్నికలు వాయిదా వేసుకుంటే, ఈ డబ్బును కేరళ కు సర్దుబాటు చేసుకోవచ్చని, అలాకాకుండా కేరళ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలకు కలిపితే కనీసం రూ.1,800 కోట్ల వరకు ఖర్చు అవుతాయని, స్వల్పకాలంలో ఇంత బ్లాక్‌మనీ సర్దుబాటు చేయలేమని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
ఒక్కొక్క మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడిన అగ్రనేత,, మీ వాటాకు ఇంత, వారి వాటాకు ఇంత.. అని లెక్కలు చెప్పినట్టు తెలిసింది. ప్రతి మంత్రికి సగటున రూ.35 కోట్ల టార్గెట్ పెట్టినట్టు సమాచారం. తమకు ద్రోహం చేసి వలస కాంగ్రెస్ నేతను ముఖ్యపీఠం మీద కూర్చోబెట్టిన కేరళ సీఎం అభ్యర్థి మీద సీనియర్ కాంగ్రెస్ నేతలకు పీకల దాకా కోపం ఉన్నప్పటికీ, అగ్రనేత ఎదురుగా కూర్చొని కేరళ ఎన్నికల కాంట్రిబ్యూషన్ తప్పదంటూ, టార్గెట్ నిర్దేశించడంతో మంత్రులు మౌనంగా అంగీకరించినట్టు తెలిసింది.
తమ కు ద్రోహం చేసిన వ్యక్తి గెలుపును కాంక్షిస్తూ డబ్బు సపోర్టు చేయాల్సిన దుస్థితి ఏమిటని సీనియర్ మంత్రులు కుతకుత ఉడికిపోతున్నట్టు తెలిసింది. రూ.1,000 కోట్ల టార్గెట్‌లో నంబర్-1, నంబర్-2 నేతలు కలిపి 50% డబ్బు ఇస్తామని స్వచ్ఛందంగా హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాంట్రాక్టు కమీషన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి, బిజినెస్ పరంగా రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్న మరో ఇద్దరు మంత్రులు ఒక్కొక్కరు వందకోట్ల చొప్పున ఫండ్ సమకూర్చాలని సూచించినట్టు తెలిసింది. వారు ఆశించిన మేరకు నిధులు సర్దుబాటు చేస్తే.. మహిళా మంత్రులకు టార్గెట్‌లో కొంత మినహాయింపు ఇవ్వొచ్చని చర్చించినట్టు తెలిసింది.