హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ భూ కుంభకోణం ( Land scam) పై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లోకాయుక్త ( Lokayukta ) కు శుక్రవారం ఫిర్యాదు ( BRS Complains ) చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ , ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్యే ముఠాగోపాల్ , ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ , ఎమ్మెల్సీ కోటి రెడ్డి , కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణక్, లీగల్ సెల్ అడ్వకేట్ లలిత రెడ్డి, విశ్వేశ్వర్ , కళ్యాణ్ తదితరులు లోకాయుక్త జస్టిస్ ఏ.రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
సీఎం తమ్ముడు కొండల్ రెడ్డి ‘టెస్సెరాక్ట్’ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ. 200 కోట్ల విలువైన భూములను కేటాయించారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 5 ఎకరాల ప్రజా భూమిని కేవలం రూ. 7 కోట్లకు దారాదత్తం చేశారని విమర్శించారు. ఏరోస్పేస్ కంపెనీ అని చెప్పుకుంటున్న టెస్సెరాక్ట్ చెల్లించిన మూలధనం కేవలం రూ. లక్ష మాత్రమేనని, టెస్సెరాక్ట్ కంపెనీ అధికారిక బోర్డు నివేదిక ప్రకారం కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ‘సున్నా’ అని తేలిందని దాసోజు శ్రావణ్ ఆరోపించారు.

నివాస ఫ్లాట్ అడ్రస్‌తో నడుస్తున్న కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన డిఫెన్స్ భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీయడంతో రాత్రికి రాత్రే వెబ్సైట్లో వివరాలను మార్చేశారని తెలిపారు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా, సీఎం మేనల్లుడు నయన్ రెడ్డి సీఈవోగా ఉన్నారని లోకాయుక్తకు ఆధారాలు సమర్పించామ ని వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అబద్ధాలు చెబితే, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ భూ కేటాయింపులను స్వయంగా ఒప్పుకున్నారని వివరించారు.
రికార్డుల్లో కొండల్ రెడ్డి పేరు లేకుండా బినామీలను పెట్టారని ఆరోపించారు. కర్ణాటక ‘ముడా’ (MUDA) తరహాలోనే తెలంగాణలో టెస్సెరాక్ట్ భూ కుంభకోణం సాగిందని దుయ్యబట్టారు. టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను వెంటనే నిలిపివేసి రద్దు చేయాలని , సీఎం రేవంత్ రెడ్డి పాత్రపై విచారణ కోసం నివేదికను గవర్నర్‌కు పంపాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, టీజీఐఐసీ అధికారులపై అవినీతి నిరోధక చట్టం, బీఎన్ఎస్ సెక్షన్ల కింద విచారణకు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.