వీణవంక, ఫిబ్రవరి 27 : నిత్యం వచ్చీపోయే వాహనాలతో దుమ్ము లేచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని వీణవంక మండలం కోర్కళ్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫోర్‌లైన్ రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్ పాత తారురోడ్డును తీసి వేసి, కేవలం కంకర మాత్రమే పోశాడని, రోడ్డు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలు, ఇతర వాహనాలతో విపరీతమైన దుమ్ము లేవడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇసుక క్వారీల నిర్వాహకులు నీళ్లు పట్టకపోవడంతో నిత్యం వెళ్లే వందలాది లారీలతో విపరీతమైన దుమ్ము లేస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, దుమ్ము లేవకుండా నీళ్లు పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాతో వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.