Makutam | కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’. ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆ సంస్థకు 99వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది. విశాల్ సరసన అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటించగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు మంచి స్పందన లభించగా.. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సుమారు 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో ఉన్న ‘మకుటం’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా అంశాలను మేళవించి సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా విశాల్ మూడు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
ఒకవైపు కృపాకర్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్ పాత్రలో విశాల్ కనిపించాడు. కుటుంబమే తన ప్రపంచంగా భావించే వ్యక్తిగా ఈ పాత్రను చూపించారు. మరోవైపు లింగా అనే హార్బర్ కాంట్రాక్టర్ పాత్రలో పూర్తిగా భిన్నమైన గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో కనిపించాడు. హార్బర్లో సరుకుల స్మగ్లింగ్ చేసే లింగా జీవితంలోకి కృపాకర్ అనుకోకుండా రావడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ట్రైలర్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం విశాల్ పోషించిన మూడు పాత్రలే. కృపాకర్, లింగా మాత్రమే కాకుండా మరో విభిన్నమైన పాత్రలో కూడా విశాల్ కనిపించాడు. అయితే ఈ ముగ్గురు వేర్వేరు వ్యక్తులా? లేక ఒకే వ్యక్తికి సంబంధించిన మూడు కోణాలా? అనే సస్పెన్స్‌ను దర్శకుడు ట్రైలర్లో రివీల్ చేయకుండా మెయింటైన్ చేశారు.
‘వీరిద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారు?’, ‘కడలిని శాసించేది ఎవరు?’, ‘ఈ ముగ్గురి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి?’ అనే ప్రశ్నలను ప్రేక్షకుల్లో కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. దీంతో సినిమా కథపై ఆసక్తి పెరుగుతోంది. విశాల్‌కు జోడీగా నటించిన అంజలి పాత్రను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. దుషార విజయన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. విశాల్‌తో పాటు వీరిద్దరి పాత్రలు కథలో ఎలాంటి మలుపులు తీసుకురానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో విశాల్ ఒక పాత్రలో ఇళయరాజా అభిమానిగా కనిపించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాత్రల మధ్య వేరియేషన్, గెటప్స్, బాడీ లాంగ్వేజ్‌లో చూపించిన తేడాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లోనే విశాల్ నటనలోని వైవిధ్యం స్పష్టంగా కనిపించింది. హీరోగా ఎన్నో యాక్షన్ సినిమాల్లో మెప్పించిన విశాల్.. ‘మకుటం’తో తొలిసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ట్రైలర్‌ను చూస్తే కథను తెరపై ప్రెజెంట్ చేసే విధానంలోనూ తనదైన మార్క్ చూపించినట్లు అనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలను, పాత్రల మధ్య సంఘర్షణను, కథలోని సస్పెన్స్‌ను ఆసక్తికరంగా ఎలివేట్ చేశారు. హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా విశాల్ ఎలాంటి మార్క్ వేస్తాడో తెలుసుకోవాలంటే ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే.