దాశరథి కవిత్వాన్ని అంచనా వేసి చూస్తే ఆయన తెలంగాణలో ప్రజ్వరిల్లిన సంఘర్షణకు, పునరుజ్జీవనానికి ప్రతీకగా రూపొందిన కవిగా నిరూపితమవుతారు. ఆయన కవితా రంగంలోకి వచ్చేదాకా తెలంగాణలో సాహిత్య సృష్టి 17, 18వ శతాబ్దాల్లో తెలుగు సాహిత్యంలో సామాన్యంగా ప్రతిఫలించే క్షీణ కవితా యుగానికి ప్రతిధ్వనులుగా వచ్చిన రచనలే అధికంగా ఉండేవి. తెలంగాణలో పునరుజ్జీవనోద్యమం 1920 నాటికే స్పష్టమైన రూపం దాల్చిందనుకొంటే అంతకు పూర్వం కేవలం గ్రంథాలయోద్యమంగా ప్రారంభమైన ఈ ధోరణి ప్రజాజీవనంలోని అన్ని రంగాలను స్పృశించే స్థితి ఈనాటికి ఏర్పడింది.
హైదరాబాద్ ఆంధ్ర జన సంఘం ఏర్పడటం, ఇనుగుర్తిలో ‘తెనుగు పత్రిక’ ప్రారంభం కావడం, నల్గొండ నుండి ‘నీలగిరి’ పత్రిక రావడం, లక్ష్మణరాయ పరిశోధన మండలి ఏర్పడటం, శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం తెలుగు వారి కార్యకలాపాలకు కేంద్రమయ్యాయి. మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, ఒద్దిరాజు సోదరులు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వాళ్లందరూ ఈ చైతన్యరథాన్ని ముందుకు తీసుకువెళ్లారు.
అయితే, వీళ్లందరూ శాంతస్వరూపులు. అయితే నాల్గవ దశకం పూర్తియ్యే నాటికే రాజకీయోద్యమంగా కూడా దీనికి పరిణతి ఏర్పడింది. దీని ఫలితంగానే తీవ్రమవుతున్న ఈ చైతన్యాన్ని పలికించడం కోసం తెలంగాణ ఐదవ దశకం ప్రారంభంలోనే ఒక కవిని ఆవిష్కరించుకొన్నది. దాశరథి కవిత్వంలో జాతీయత జాలువారిన విధానాన్ని పరిశోధనాత్మకంగా విశ్లేషణ చేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.
దాశరథి అనే తమ ఇంటిపేరుతోనే ప్రసిద్ధులైన కృష్ణమాచార్యుల కవితా సాధనంతా ఈ చైతన్యాగ్ని విలసితమే. ఆయన కవిత్వాన్ని ప్రధానంగా రెండు దశలుగా విభజించవచ్చును. తొలిదశ ‘అగ్నిధార’ నుంచి ‘మహాంధ్రోదయం’ వరకు వ్యాపించి ఉన్నది. ‘పునర్నవం’ నుంచి చేసిన రచనలు రెండవ దశ. తొలి దశలో కవిత్వానికి, విముక్తోద్యమానికి అభేదాన్ని భావించి ఆచరణలో కొనసాగించిన తొలి తెలుగు కవి దాశరథి. ఇది తెలుగు కవితా చరిత్రలోనే ఒక అపూర్వ సన్నివేశం. ఈ కాలంలో చేసిన రచనంతా సమష్టి ప్రజా చైతన్యాన్ని స్పందింపజేసేది. అందుకే కొందరు విమర్శకులు దాశరథికి, తెలంగాణకు అభేదం చెప్పారు. ఈ ప్రతీకార్థంలో భావించినప్పుడు భారతదేశ సాహిత్య చరిత్రలో బంకించంద్రుడు ‘వందేమాతరం’ గీతం ఆలపించినప్పుడు జాతీయ చైతన్యంతో అభేదాన్ని పొందిన చైతన్యం స్మరణకు వస్తున్నది.
దాశరథి అభ్యుదయ భావనలో జాతీయత, దేశభక్తి ఇమిడి ఉంటాయి. ఆయన అభ్యుదయ కవుల్లో జాతీయ తత్త్వాన్ని అన్వయింపజేసే ప్రయత్నం చేశారు. ఆ ఉద్యమాన్ని దేశ సంస్కృతికి, పరిస్థితులకు, ఆలోచనా విధానాలకు అనుగుణంగా పరివర్తింపజేసే ప్రయత్నం ఆయన కవితల్లో సాగింది. తెలంగాణమంటే దాశరథికి వల్లమాలిన ప్రేమ. అతని దృష్టిలో కన్నతల్లికి, కన్నభూమికి అభేదం. కన్నతల్లి కన్నా మిన్నగా జన్మభూమిని భావించారు.
దాశరథి కవిత్వంలోని జాతీయతను పరిశీలిస్తే..ఆయన నిజమైన ప్రజాకవి అని తెలుస్తుంది. ప్రజల కష్టనిష్ఠూరాల్లో తానొకడిగా కలిసిపోయారు. దాశరథిపై అభ్యుదయ కవితా ముద్ర ఉంది. అగ్నిధార, రుద్రవీణ కావ్యాలు తెలంగాణలోని దారుణ విషాద పరిస్థితులను కండ్ల ముందు నిలుపుతాయి.
ఆ రోజుల్లో ‘మా నిజాము రాజు జన్మజన్మాల బూజు’ అనడానికి ఎన్ని గుండెలు కావాలి? దాశరథి కవిత్వం తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రతిబింబం అంటారు దేవులపల్లి రామానుజ రావు. ‘అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం అనాథుడికి ఆగర్బ శ్రీమంతుడికీ మధ్య’ అనే అగ్నిధారలోని చరణాలు అభ్యుదయ కవితా లక్షణమైన వర్గ సంఘర్షణను సూచిస్తున్నాయి.
ఉద్యమ కవిత్వాన్ని పద్యంలో నడపడం దాశరథి ప్రత్యేకత. ఆయన తెలంగాణలో నవ్య కవికుల గురువు అన్నారు జీవీ సుబ్రహ్మణ్యం. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్న వాల్మీకి సూక్తి ఈ భావనకి మూలం. దాశరథి ‘రుద్రవీణ’ కావ్యాన్ని తన కన్నభూమి అయిన తెలంగాణకు అంకితమిచ్చారు. అంకిత పద్యం ఆరంభంలో ‘నను గని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ’ అని ప్రారంభించారు. ఇరవై ఏండ్ల తర్వాత తన ‘తిమిరంతో సమరం’ కావ్యాన్ని తన మాతృమూర్తికి అంకితం ఇస్తూ ‘నను గని పెంచి నా రుధిర రుద్ర నావములన్ కవితా మరంద వాహిని ప్రవహింపజేసి రసహీన మనో మరుభూమి నందనందనములు నాటినట్టి కరుణామయి’ అని పేర్కొన్నారు.
ఈ రెండు పద్యాల రచనకు మధ్య చాలాకాలం అంతరం ఉన్నా భావ భూమిక ఒక్కటే, రెండు పద్యాల ఎత్తుగడ, వాడిన విశేషణాలను బట్టి చూస్తే కవికి ఇద్దరి పట్ల అభేదం కనిపిస్తుంది. ‘కరుణామయి’ అన్నది రెంటిలోనూ సమానంగా వాడిన విశేషణం. అగ్నిధార ఆరంభ పద్యంలోనే భారతదేశాన్ని తల్లిగా భావించి ఆరాధించారు. ‘ఓ జనతానతాంజలి…అంటూ జెండా ఒక్కటి మువ్వన్నెలది..దేశం బొక్కటే భారతాఖండా సేతు హిమాచలోర్వర..తల్లీ మహా భారతీ’ అని జాతీయ సూక్తాన్ని కీర్తించి దేశమొక్కటే అన్న భావాన్ని వ్యక్తం చేశారు.
దాశరథి కూడా ప్రగతివాద తరహా రచనలు చేసినప్పటికీ, ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నప్పటికీ ఆయన కవితా సృష్టి మిగిలిన ప్రగతివాద కవుల కంటే భిన్నమైంది. ప్రగతి భావనతో పాటు జాతీయోద్యమ వీరావేశం మిన్నెత్తుగా కనబడుతుంది. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’, ‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’ ‘తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో’ మొదలైన పద్యాల్లో ఈ జాతీయాభిమాన ధోరణి వెల్లడవుతున్నది. ఆధునికుల్లో, జాతీయోద్యమ కవుల్లో ఉత్కట భావావేశం గల వారిలో విశ్వనాథ తర్వాత దాశరథిని పేర్కొనాలని రామకోటి శాస్త్రి అన్నారు.
దాశరథి కవితలో కృష్ణమ్మ పరుగులు, గోదావరి ఉరుకులు, తుంగభద్ర వయ్యారాలను వర్ణించారు. ‘ఎవరి గజ్జెల రవళివే నీవు..మంజీరా ఎవరి గజ్జెల బాష్పధారవే నీవు..మంజీరా నీవు..పారిన దారిలో ఇక్షు దండాలు నీవు..జారిన జాగలో అమృత భాండాలు’ అంటూ మంజీరా నదిని వర్ణించారు.
గజ్జెల రవళి అనడంలో తరంగ ధ్వనిని, బాష్పాధార అన్నప్పుడు ప్రవాహ వేగాన్ని ధ్వనింపజేశారు. ఛత్రపతి శివాజీ, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి తదితర వీరుల శౌర్యాన్ని వర్ణించడం ఒకటి. వర్తమానంలోని ఉద్యమాన్ని నడుపుతూ నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ లాంటి నాయకులను వర్ణించడంతోపాటు, మాతృదేశ రక్షణకు పోరాడే వీరుల్ని కీర్తించడం లాంటి రచనలు రెండో అంశంలోకి వస్తాయి. యుద్ధం చేస్తూ శత్రువుల నెదుర్కొన్న ‘వీర మూర్తిని భరత వీర సైనికుడు ప్రళయకాల శంకరుడై ఢమరువు మోగించినారు. త్రిశూలమును విసిరినాడు. త్రినేత్రాగ్నియై కురిసినాడు. ఇక భరత జాతినెవరు ఎదిరింపగ లేదు లెమ్ము..ఇక భరతమాతనెవడు జడిపింపగా లేదు లెమ్ము’ అని భరత వీరుల్ని కీర్తించారు.
దాశరథి 1948 జనవరి 3వ తేదీన జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు నాటి నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ ఈ విధంగా రాశారు. ‘చేతులారగ నీవు పెంచిన స్వతంత్ర నాగవల్లికయె విషనాగమయ్యె నీ గళము చుట్టి ప్రాణాలు లాగివేసే భారతీయుల గౌరవ ప్రతిభ మాసే’. ఎందరో వీరులు పోరాడితే, త్యాగమూర్తుల ఆత్మార్పణ ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దాశరథి 1981లో రచించిన ఖండకావ్యం ‘ధ్వజమెత్తిన ప్రజ’ ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేసి మరో ప్రపంచం వైపు తీసుకువెళ్లారు.
‘జాతి అంతా శ్రమిస్తేనే సాహసంతో చర్చిస్తేనే దరిద్రాన్ని రూపుమాపి చరిత్రను సృష్టించగలం. నేను శ్రామిక జనార్ధనుడిని. నేను కార్మిక వ్యతిరేకి కాళియ మర్దనుడిని. నేను సామాన్య ప్రపంచ పౌరుడిని. అయినా నేను అసామాన్య ప్రజా వీరుడిని’ అంటారాయన.
శ్రీశ్రీ మహాప్రస్థానం అంటే దాశరథి మరో ప్రపంచం వైపునకు ప్రజావళి కదలాలి అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం, సమానత్వం సౌభ్రాతృత్వం విలువల కోసం నిరంతరం పోరాడిన కవిగా దాశరథికి తెలుగు సాహితీ ప్రపంచంలో సమున్నత స్థానం ఉంది. మొత్తంగా దాశరథి కవిత్వ ప్రవాహంలో ఒక ముఖ్యమైన పాయ జాతీయాభిమానం.
– డాక్టర్ ఆగపాటి రాజ్ కుమార్ 8309706806