Deepak Yadav : టెన్నిస్ ప్లేయర్ (Tennis player) రాధికా యాదవ్ (Radhika Yadav) ను హత్య చేసిన ఆమె తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నాడు. తాను కన్యావధ (Kanya Vadh) చేశానని, తనను ఉరితీయాలని ఎఫ్ఐఆర్లో రాయాలని అరెస్ట్ అనంతరం ఆయన పోలీసులను వేడుకుంటున్నాడు. ఈ విషయాన్ని దీపక్ యాదవ్ అన్న విజయ్ యాదవ్ (Vijay Yadav) మీడియాకు వెల్లడించారు.
రాధికా యాదవ్ హత్యను తీవ్రంగా ఖండిస్తూనే తన తమ్ముడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడని విజయ్ యాదవ్ తెలిపారు. ‘ఏదేమైనా జరిగింది పెద్ద తప్పిదమే. తాను పోలీస్‌స్టేషన్‌లో అతడితో ఉన్నప్పుడు అతడు పోలీసులతో.. ‘నా వాంగ్మూలం రాసుకోండి. నేను కన్యావధకు పాల్పడ్డాను. నన్ను ఉరితీయండి. ఆ ప్రకారమే మీరు ఎఫ్ఐఆర్ తయారు చేయండి’ అని చెప్పాడని ఆయన వెల్లడించారు. పశ్యాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం, శిక్ష లేవని వ్యాఖ్యానించాడు.
కాగా టెన్నిస్ క్రీడాకారిణి అయిన రాధికా యాదవ్‌ను గత గురువారం ఉదయం ఆమె తండ్రి దీపక్ యాదవ్ హత్య చేశాడు. గురుగ్రామ్‌లోని వారి నివాసంలోనే ఆమె ప్రాణం తీశాడు. కిచెన్‌లో వంట పని చేస్తున్న రాధికా యాదవ్ వెనుక నుంచి వెళ్లి తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల బుల్లెట్లు ఒంట్లోంచి దూసుకెళ్లడంతో రాధిక అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
రాధికా యాదవ్ సొంతంగా టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో ఇరుగుపొరుగు తనను కుమార్తె సంపాదనతో బతుకుతున్నావని హేళన చేస్తున్నారని, దాంతో అకాడమీని మూసివేయమని ఎంత చెప్పినా తన కుమార్తె వినిపించుకోలేదని, అందుకే ఆమెను హత్య చేశానని పోలీసుల విచారణలో దీపక్ యాదవ్ తెలిపాడు. కానీ కుమార్తెను హత్య చేసినందుకు ఆయన పశ్చాత్తాపం చెందుతున్నాడు. తనను ఉరితీయాలని కోరుతున్నాడు.