రుద్రంపూర్, మార్చి 11 : ఎరువుల సమతుల వినియోగం, పంట మార్పిడి విధానం, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతతో పాటు వరిలో సన్న రకాల సాగు, వాటి ప్రయోజనాలపై ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అశ్వరావుపేట డివిజనల్ వ్యవసాయ శాఖ సహకారంతో రైతులకు బుధవారం శిక్షణా కార్యక్రమం కల్పించారు. కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా అశ్వరావుపేట డివిజనల్ ఆత్మ చైర్మన్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న యాంత్రీకరణ పథకాల గురించి వివరించారు.
అశ్వరావుపేట డివిజనల్ ఏడీ రవికుమార్ మాట్లాడుతూ.. రైతులు తప్పనిసరిగా ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు. విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ శరత్ వరిలో వచ్చే వివిధ తెగుళ్ల నివారణ పద్ధతులను వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ మాట్లాడుతూ.. కూరగాయల పంటలపై అందుబాటులో ఉన్న పథకాలు, పంట మార్పిడి విధానాలను వివరించారు. వరంగల్ డివిజనల్ ఫ్యాక్ట్ చైర్మన్ మాట్లాడుతూ ఫ్యాక్ట్ సంస్థ ద్వారా రైతులకు అందిస్తున్న ఎరువుల గురించి తెలియజేశారు. ములకలపల్లి మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సుమారు 120 మంది రైతులు పాల్గొన్నారు.

పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన