Pavala Shyamala | సినీ నటి పావలా శ్యామల కన్నుమూసింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లుగా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.
ఏపీలోని గుంటూరు జిల్లాలో 1951లో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. పదో తరగతి వరకు చదువుకున్న ఆమె.. నాటక రంగంతో నటన రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. 1985లో బాలకృష్ణ హీరోగా వచ్చిన బాబాయ్ అబ్బాయ్ సినిమాతో పావలా శ్యామల ఇండస్ట్రీలోకి వచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాతో నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఖడ్గం, గోలీమార్, ఆంధ్రావాలా సినిమాలతో ఆమె పాపులర్ అయ్యింది.