TFTDDA President Sumalatha Devi | తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవిపై కొంతమంది దుండగులు భౌతిక దాడికి పాల్పడటం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఇందిరానగర్‌లోని రాఘవ గెస్ట్ హౌస్‌లో అత్యంత కీలకమైన జనరల్ బాడీ సమావేశం జరుగుతున్న సమయంలో ఈ అవాంఛనీయ ఘటన వెలుగు చూసింది.
సమావేశం సజావుగా సాగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు ముందస్తు ప్లాన్‌తో సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆపై తనపై భౌతిక దాడికి దిగారని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం దాడితో ఆగకుండా, అసోసియేషన్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రికార్డులను బలవంతంగా, అక్రమంగా ఎత్తుకెళ్లడానికి వారు ప్రయత్నించారని ఆమె పోలీసులకు తెలిపారు. అంతేకాకుండా, తాను వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ప్రాణాలతో ఉండనివ్వమని తీవ్రంగా హెచ్చరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు.
ఈ అనూహ్య పరిణామాలు, ప్రాణహాని హెచ్చరికలతో బెంబేలెత్తిపోయిన సుమలతా దేవి వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. తనకు మరియు తన కుటుంబ సభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను అభ్యర్థించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజానిజాలు వెలుగులోకి రావాలంటే, రాఘవ గెస్ట్ హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.