Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘పుష్ప’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా లో నటిస్తుండగా, ఆ తర్వాత తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న AA23పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, ప్రత్యేక గ్లింప్స్ వీడియోతో అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. AA23 సినిమాలో అసలు హీరోయిన్ పాత్రే ఉండదట!
లోకేష్ కనగరాజ్ సినిమాలంటే స్టైలిష్ యాక్షన్, బలమైన కథ, ఎమోషన్స్‌కు పెద్దపీట వేయడం తెలిసిందే. అవసరం లేని కమర్షియల్ అంశాలను దూరంగా ఉంచుతూ కథను సహజంగా నడిపించడం ఆయన ప్రత్యేకత. గతంలో ఆయన తెరకెక్కించిన ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’ వంటి చిత్రాల్లో సంప్రదాయ హీరోయిన్ పాత్రలు, డ్యూయెట్ పాటలు లేదా ప్రత్యేక లవ్ ట్రాక్ లేకుండానే కథను ముందుకు తీసుకెళ్లి భారీ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో తెరకెక్కించే AA23లో కూడా అదే ఫార్ములాను అనుసరించాలని లోకేష్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ ప్రధానంగా సాగనున్న కథతో రూపొందనుంది. కథకు అవసరం లేకపోతే బలవంతంగా హీరోయిన్ లేదా ప్రేమకథను జోడించకూడదనే ఆలోచనతో లోకేష్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా, కథనే ప్రధాన బలంగా చేసుకుని సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కెరీర్‌ను పరిశీలిస్తే దాదాపు ప్రతి సినిమాలో ఆయన సరసన హీరోయిన్ ఉంటుంది. అయితే ‘రుద్రమదేవి’ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో ప్రత్యేక పాత్ర పోషించినప్పుడు మాత్రమే ఆయనకు హీరోయిన్ కనిపించలేదు. కానీ పూర్తి స్థాయి సోలో హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ లేకపోవడం ఇదే తొలిసారి కావచ్చని అభిమానులు చర్చించుకుంటున్నారు. హీరోయిన్ లేకుండా పూర్తిగా కథ, యాక్షన్, ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కితే అది బన్నీ కెరీర్లోనే అత్యంత భిన్నమైన చిత్రంగా నిలిచే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.