Donald Trump : ఇరాన్ (Iran) తో అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని.. ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం (Nuclear agreement ) కుదుర్చుకోవాలని హెచ్చరించారు.
పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని ఇరాన్‌కు ట్రంప్ సూచించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు అవకాశం తర్వాత అవకాశం ఇస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినా టెహ్రాన్ అంగీకరించలేదని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని అత్యుత్తమ, అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందని, అందులో చాలామటుకు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఇజ్రాయెల్‌కు తెలుసని, ఆ తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.
ఇరాన్లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని, భారీ విధ్వంసం జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మారణహోమం మరింత దారుణంగా మారడానికి కొంత సమయం పడుతుందని, పరిస్థితులు చేయి దాటకముందే ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. తాను చెప్పినట్లు చేస్తే ఇక మరణాలు, విధ్వంసాలు ఉండవని తెలిపారు. కాగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలవల్ల పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది.
ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్అవీవ్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ మృతి చెందారు. ఆ దేశ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బఘేరి కూడా మరణించారు. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు.