Flight crash : గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదం నింపింది. విమానంలోని 241 మందితోపాటు, ఆ విమానం ఢీకొన్న హాస్టల్ భవనంలో కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాయి. వారిలో ఎవరిని కదిలించినా ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ ఉంది.
విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో పాయల్ కార్తీక్ కూడా ఒకరు. ఆమె ఉన్నత చదువుల కోసం తొలిసారి విదేశాలకు బయలుదేరి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటనపై ఆమె తండ్రి సురేష్ కార్తీక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె కాలేజీ చదువులు పూర్తికాగానే తమతోనే ఉండేదని, పై చదువులకు లండన్ వెళ్తాననడంతో అప్పులు చేసి విమానం ఎక్కించామని, ఇంతలో ఇలా జరిగిందని ఆవేదన వెలిబుచ్చారు.
ప్రమాదం గురించి తెలియగానే సురేష్ కార్తీక్, అతని బంధువులు అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా పలకరించడంతో ఆయన తన విషాద గాథను చెప్పుకున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని గుర్తించేందుకు అధికారులు తన డీఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నారని తెలిపారు. సురేష్ కార్తీక్ కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉందని, ఆయన రిక్షా లాగి కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అతని బంధువు ఒకరు చెప్పారు.
తండ్రి ఆర్థిక పరిస్థితిని చూస్తూ పెరిగిన పాయల్ కార్తీక్.. చదువుకుంటూనే ట్యూషన్లు చెప్పేదని, కుటుంబ పోషణలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేదని ఆమె బంధువులు తెలిపారు. పాయల్ ఉన్నత చదువులు పూర్తయితే ఆ కుంటుంబం ఆర్థిక కష్టాలన్నీ తీరుతాయని భావించామని, ఇంతలో ఇలా జరిగిందని చెప్పారు. పాయల్‌ను సాగనంపి వెళ్లిన మాకు ఇంతలో ఈ దుర్వార్త తెలియడంతో మళ్లీ వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.