Flight crash : అహ్మదాబాద్ (Ahmedabad) లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన (Airindia flight) ప్రమాదంలో మరణించిన వారిలో 61 మంది విదేశీ ప్రయాణికులు (Foreign passengers) ఉన్నారు. వారిలో 53 మంది బ్రిటిషర్స్, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒకరు కెనడియన్. ఈ నేపథ్యంలో ప్రమాదానికి సంబంధించి ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి (Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) తెలిపారు.
యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన ఫారిన్ సెక్రెటరీ డేవిడ్ లామీ, పోర్చుగల్ ఫారిన్ మినిస్టర్ పౌలో రాంగెల్, కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి అనితా ఆనంద్‌లతో తాను టచ్ ఉన్నానని, విమాన ప్రమాదం, తదనంతర చర్యలకు సంబంధించిన సమాచారాన్ని తాను వారితో పంచుకుంటున్నానని జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
ప్రమాదంలో ఆయా దేశాల పౌరులు మరణించినందున తీవ్ర సంతాపం తెలియజేశానని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారి పౌరుల మృతదేహాలను చేరవేయడంలో అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని మాట ఇచ్చానని జైశంకర్ తెలిపారు.