రుద్రంపూర్, మార్చి 17 : చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిఎస్ఐ చర్చి సమీపంలో తాగునీటి పైపు లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అధికారులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టినా, అవి పూర్తి స్థాయిలో ఫలించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వచ్చే పైప్ లైన్ జాయింట్ లీక్ కావడంతో కొన్ని రోజుల పాటు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అనంతరం మరమ్మతులు చేపట్టినా వెంటనే మిషన్ భగీరథ పైప్ లైన్ మళ్లీ లీక్ కావడంతో సమస్య మరింత తీవ్రమైంది. ఈ లీకేజీల కారణంగా ఆ ప్రాంతమంతా బురదగా మారి, నీరు గుంటలుగా నిల్వ ఉండిపోయింది. ఈ గుంటలలో పందులు తిరుగుతుండగా అదే నీటిని తాగే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు కలుషిత నీరు తాగాల్సిన దుస్థితి ఏర్పడింది.
పంచాయతీ, మిషన్ భగీరథ సిబ్బంది మధ్య సమన్వయం లోపించడంతో సమస్యలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పందులు తాగిన నీటినే తాము తాగాలా? అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే లీకేజీలను పూర్తిగా గుర్తించి శాశ్వత పరిష్కారం చూపి శుభ్రమైన నీరు అందించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

రుద్రంపూర్లో పైప్ లీకేజీలకు పరిష్కారమెప్పుడు?