హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. అందులో మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి పరిగి నియోజకవర్గం నారాయణపూర్‌లో సభ ఏర్పాటుచేశారు. కానీ, సభాస్థలిని ఆనుకుని ఉన్న పరిగి మున్సిపాలిటీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. ఈ మున్సిపాలిటీలో 18 వార్డులుంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎనిమిది స్థానాల చొప్పున గెలుచుకున్నాయి.
ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. మరోవైపు స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్‌కు ముందుగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో వార్డును ఏకగ్రీవం చేసుకున్నాయి. కానీ, కాంగ్రెస్.. బీఆర్ఎస్ అభ్యర్థిని బెదిరించి తమ వైపు గుంజుకున్నది. పోలింగ్ జరిగిన 32 వార్డుల్లో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ పది స్థానాలు గెలుచుకున్నది. మ్యాజిక్ ఫిగర్ 18 కావడంతో బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవమైన అభ్యర్థితో కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకోనున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ఓటర్లు బీఆర్ఎస్కు ఏకపక్షంగా పట్టం కట్టగా.. మున్సిపల్ ఎన్నికల్లోనూ దాదాపు అదే పరిస్థితులు కనిపించాయి. మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 18 మున్సిపాలిటీల్లో ఓటర్లు అధికార కాంగ్రెస్‌కు దీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్కు అండగా నిలిచారు. హస్తం పార్టీ కేవలం ఆరు మున్సిపాలిటీలను గెలుచుకోగా, బీఆర్ఎస్ ఏడు మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
రంగారెడ్డిలోని మొయినాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్, సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్, జిన్నారం మున్సిపాలిటీల్లో హంగ్ అనివార్యం కానున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 3 గెలిచాయి. మొయినాబాద్ పరిధిలో 26 వార్డుల్లో 7 బీఆర్ఎస్ గెలిచింది. వికారాబాద్‌లో 34 వార్డులకుగాను కాంగ్రెస్ ఏకగీవ్రం సహా 17 వార్డులను గెలుచుకున్నది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని 5మున్సిపాలిటీల్లో కారు జోరు కనిపించింది. ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల చైర్మన్ స్థానాలు సొంతం చేసుకోనున్నది.