మన భారతదేశంలో నాగారాధన సనాతన కాలం నుంచి వస్తున్నది. సుబ్రహ్మణ్య స్వామిని నాగపూజకు ప్రతీకగా ఆరాధిస్తారు. నాగ శబ్దంతో ఎన్నో గ్రామాలు ఉండటమే కాదు ఏకంగా నాగాలాండ్ అనే రాష్ట్రమే ఉండటం ‘నాగ’ ప్రాముఖ్యతను తెలియపరుస్తుంది. అంతేకాదు నాగ దేవతకు సంవత్సరంలో రెండుమార్లు.. అనగా శ్రావణ శుక్ల పంచమి, కార్తీక శుద్ధ చవితి నాడు పండుగ జరపడం విశేషం..
పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడి మానస పుత్రుడైన కశ్యప ప్రజాపతికి అనేకమంది భార్యలు ఉన్నారు. వారిలో కద్రువ, వినత అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. కశ్యప మహర్షి అనుగ్రహంతో కద్రువకు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఐరావతుడు లాంటి మహాసర్పాలతో కూడిన నాగజాతి జన్మించింది. వారు జన్మించిన తిథి శ్రావణ శుద్ధ పంచమి. అయితే అలా జన్మించిన నాగులు తొలినాళ్లలో కనబడిన వారినల్లా కాటు వేస్తూ సృష్టిని భయభ్రాంతులకు గురిచేశాయట. దీంతో తల్లి కద్రువ కూడా ఒకానొక సందర్భంలో కోపించి తన కుమారులైన సర్పాలన్నీ జనమేజయుడు చేసే ‘సర్పయాగం’లో పడి భస్మమైపోతాయని శాపం ఇస్తుంది.
ఆ తల్లి శాపానికి భయపడిన సర్పాలన్నీ శ్రావణ శుద్ధ పంచమి నాడే బ్రహ్మదేవుడిని శరణు కోరాయి. అప్పుడు బ్రహ్మదేవుడు.. ‘సర్పాలు కేవలం దుష్టులను మాత్రమే కాటు వేయాలి, సాధువులను హింసించకూడదు’ అని శాసించి, సర్పయాగం నుంచి వారిని రక్షించడానికి ‘ఆస్తీక మహర్షి’ జన్మిస్తాడని అభయమిచ్చాడు. ఆ విధంగా సర్పాలకు బ్రహ్మదేవుడి అనుగ్రహం లభించి, నాగజాతికి పునర్జన్మ లభించిన రోజు కూడా ఇదే పంచమి తిథి కావడం విశేషం. కార్తీక మాసంలో నాగుల చవితి జరుపుకోవడానికి కారణం క్షీర సాగర మథనం సందర్భంగా శివుడు విషం మింగినప్పుడు ఆయన గొంతులో ఏర్పడిన తీవ్రమైన వేడిని తగ్గించడానికి నాగులు సాయపడటమని పురాణ కథనం
న+అగ= నాగము.. ఉరగము అంటే ఉదరంతో భూమిని పట్టుకొని పాకేది అని అర్థం. పాముల నివాసం పాతాళం. నాగులు పుట్టలో నివసిస్తాయి.
విషాలను హరించాలని పుట్టలో పాలు పోస్తాం కానీ, మానవ శరీరమే ఒక పుట్ట. నవరంధ్రాలలోంచి వెలువడే కామ, క్రోధ లోభాది విషాలను.. పాలతో నియంత్రించాలని అర్థం. పాము పగ పడుతుందంటారు. సర్పం.. సింహం, పులి, ఎలుగులా వేటాడే జంతుజాతికి చెందింది కాదు. పంటలను నాశనం చేసే ఎలుకలను హరించే రైతు నేస్తం. అందుకే అనెలిడా వర్గానికి చెందిన ఎర్రను (earth worm) వానపాము (Feritima posthuma) అంటారు. అయితే వానపాము వెన్నెముకలేని జీవి. ‘పాము’ శబ్దం గురించి ప్రస్తావించినప్పుడు వెన్నుపాము, వాన పాము మొదలగు పదబంధాలలో పాము జీవితంలో కీలక స్థానాన్ని సూచించే సంకేతాలని నా ఉద్దేశం. భారతంలో ఉదంకోపాఖ్యానం పారాయణం చేస్తే సర్ప భయం ఉండదంటారు.
‘బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీధర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు స్సహతర మూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్య యైనయ య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు బ్రసన్నుడయ్యెడున్’ అనే పద్యం నన్నయ మహాభారతంలో నాగస్తుతిలో భాగంగా ఉంది. అనగా, అసంఖ్యాకమైన పాములతో కూడిన భూమిని ధరించిన, మహానాగమైన అనంత దేవుడు తమకు అనుగ్రహం చూపాలని భావం. ఆధునిక యుగంలో విశ్వనాథ వారి ‘వేయి పడగలు’ నవల సర్పాన్ని ధర్మదేవతకు ప్రతీకగా చూపిస్తుంది.
తీవ్ర కృషి చేసి త్రిమూర్తుల సరసన చేరడం.. సర్పం పట్టుదలను సూచిస్తుంది. తన శత్రువు, విష్ణు వాహనుడైన గరుడునితో సఖ్యత కలిగి తన సామరస్యాన్ని చూపింది. శంకరుని గళంలో హారమై, విష్ణువుకు పానుపైన నాగరాజును ఆరాధించి తరించండి.