వరంగల్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణప్రతినిధి): ప్రపంచ వారసత్వ కట్టడం రామప్పను సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ నుంచి రక్షించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కోరింది. తెలంగాణ నుంచి ఉన్న ఒకే ఒక యునెస్కో గుర్తింపు నిర్మాణాన్ని కాపాడకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని విజ్ఞప్తి చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రిని కలిసి రామప్ప ఆలయ ప్రాముఖ్యత, చారిత్రక ప్రాధాన్యత, యునెస్కో గుర్తింపు నేపథ్యం తదితర అంశాలను కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు వివరించారు.
రామప్ప గుడిని, 3 టీఎంసీల నీటి నిలువ ఉండే రామప్ప చెరువును సింగరేణి ఓపెన్‌కాస్ట్ తవ్వకాల కోసం బలిపెట్టొద్దని కోరారు. శిల్పకళా విశ్వవిద్యాలయంగా భాసిల్లిన రామప్పకు ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని ఆధారాలతో సహా వివరించారు. కేంద్రం కలుగజేసుకొని రామప్పను రక్షించాలని కోరారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ప్రొఫెసర్ పాండు రంగారావు, వరంగల్ మాజీ మేయర్ టీ రాజేశ్వర్‌రావు, నరహరి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.