Flight crash : గుజరాత్ రాష్ట్రం (Gujarat state) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. విమానం బీజే మెడికల్ (BJ medical) కాలేజీకి సంబంధించిన యూజీ మెస్ (UG mess) బిల్డింగుపై పడటంతో.. ఆ సమయంలో అక్కడున్న 20 మందికిపైగా విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది.
యూజీ మెస్‌లో వంటపని చేసే ఠాకూర్ రవి తల్లి, రెండేళ్ల కుమార్తె ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఠాకూర్ రవి మీడియాకు వెల్లడించారు. తాను, తన భార్య, తల్లి, తమ్ముడు కలిసి యూజీ మెస్‌లో వంటలు చేస్తుంటామని, గురువారం కూడా ఎప్పటిలాగే వంటలు చేసిన తర్వాత ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ ప్రమాదంలో తన తల్లి సరళాబెన్ ప్రహ్లాద్జీ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆద్యరవి ఠాకూర్ గల్లంతయ్యారని రవి ఠాకూర్ చెప్పారు. వారి కోసం గురువారం చీకటిపడేవరకు వేచిచూసినా జాడ దొరకలేదన్నారు. వాళ్లు భవనం లోపలే చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు.