అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటసతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న పానిండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఆదివారం చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన పుట్టిన రోజు సందర్భంగా సినీ పరిశ్రమ నుంచి అనేకమంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే.. వాటన్నింటిలో హీరో రామ్‌చరణ్ షేర్ చేసిన సందేశం ఆసక్తిని రేకెత్తించడమే కాక, చర్చనీయాంశమైంది. ‘నా ‘పెద్ది’ కెప్టెన్ బుచ్చిబాబు సానా గారికి హ్యాపీ బర్త్‌డే.
సెట్స్‌పై ప్రతి రోజూ మీరు చూపించే ప్యాషన్, డీటైలింగ్, రూటెడ్ స్టోరీటెల్లింగ్ ఎంతో ఎన్స్పైరింగ్గా ఉంటుంది. మనం కలిసి ఇంకా ఎన్నో మ్యాజికల్ కథల్ని సృష్టిద్దాం. ఈ ఏడాది మీ కష్టానికి తగిన గుర్తింపు రావాలని కోరుకుంటున్నా’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు రామ్‌చరణ్. దీనిపై బుచ్చిబాబు స్పందిస్తూ.. ‘మీ ఆప్యాయతకు హృదయపూర్వక ధన్యవాదాలుసార్.. ఈ ప్రయాణంలో ప్రతిరోజూ మీ నుంచి కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటున్నానుసార్.
ఇది నాకు విలువైన అనుభవం. ఎడిట్ రూమ్‌లో చూస్తున్న ప్రతిసారీ మీ నటన నన్ను మంత్రముగ్ధుడ్ని చేస్తూనే ఉంది. ‘పెద్ది’గా కొన్నేళ్లు మీరు ప్రేక్షకులకు గుర్తిండిపోతారు. నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు మీకు కృతజ్ఞుడ్ని. థ్యాంక్యూ సోమచ్ మై డియరెస్ట్ చరణ్ సార్.. లవ్యూ..’ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ‘పెద్ది’ లొకేషన్లో బుచ్చిబాబు సానా బర్త్‌డే వేడుక ఘనంగా జరిగింది. టీమ్ అంతా ఆయనకు శుభాకాంక్షలందించారు.