Flight crash : అధికారులు విచారించినా కొద్ది అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight crash) లో మరణించిన ఒక్కొక్కరి విషాద గాథలు బయటికి వస్తున్నాయి. బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు, భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త ఇలా ఎవరిని కదిలించినా విషాదమే. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ఉదయ్‌పూర్ (Udaipur) కు చెందిన అన్నాచెల్లెల్లది కూడా అలాంటి విషాద గాథే.
ఉదయ్‌పూర్‌కు చెందిన శుభ్ మోదీ, షగుణ్ మోదీ ఇద్దరూ అన్నాచెల్లెల్లు. వీళ్లిద్దరూ సంజీవ్ మోదీ అనే మార్బుల్ వ్యాపారి సంతానం. శుభ్ మోదీ బ్రిటన్‌లో కెమికల్ ఇంజినీరింగ్ బీటెక్ పూర్తిచేశాడు. అతని సోదరి షగుణ్ మోదీ గాంధీనగర్‌లోని PDEU నుంచి BA-BBA చదివింది. వేసవి సెలవులు కావడంతో ఇద్దరూ లండన్ టూర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఆ మేరకు విమానం టికెట్లు బుక్ చేసుకుని గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయంలో లండన్‌కు వెళ్తే ఎయిరిండియా ఫ్లైట్ ఎక్కారు. టేకాఫ్ అయిన తర్వాత కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే ఆ విమానం కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సంజీవ్ మోదీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదువులు పూర్తిచేసుకున్న పిల్లలిద్దరూ ఇక లేరనే విషయాన్ని వారి పేరెంట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.