Flight crash : అహ్మదాబాద్ (Ahmedabad) లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం (Flight accident) లో గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపాణీ (Vijay Rupani) ప్రాణాలు కోల్పోయారు. లండన్‌లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వెళ్తూ ప్రమాదంలో ఆయన మరణించారు. 60 ఏళ్ల క్రితం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంత్రాయ్ మెహతా వెళ్తున్న చాపర్‌ను పాకిస్థాన్ కూల్చివేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
1965లో నాటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానాన్ని దాయాది పాకిస్థాన్ కూల్చివేసింది. భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఆ ఘటన చోటుచేసుకుంది. 1965 ఆగస్టులో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైంది. సెప్టెంబర్ నాటికి అది తీవ్రమైంది. దాంతో బేషరతుగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఐరాస భద్రతామండలి తీర్మానం చేసింది. అందుకు భారత్ వెంటనే అంగీకరించింది. పాకిస్థాన్ మాత్రం నాన్చివేత ధోరణి అనుసరిస్తూ అంగీకారం తెలిపింది.
అయినప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 19న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంత్రాయ్ మెహతా ఆయన భార్య సరోజ్‌బెన్, ముగ్గురు సహాయకులు, ఇద్దరు జర్నలిస్టులతో కలిసి చాపర్‌లో మిథాపూర్ బయలుదేరారు. ఆ చాపర్‌ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ పైలట్ జహంగీర్ ఇంజినీర్ నడిపారు. అయితే పొరపాటుగా వారు ప్రయాణిస్తున్న చాపర్ భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లింది.
అది గమనించిన పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్ ఖాయిస్ హుస్సేన్.. బల్వంత్రాయ్ చాపర్‌ను నిఘా జెట్‌గా అనుమానించారు. వెంటనే తన యుద్ధ విమానంతో దూసుకొచ్చారు. బల్వంత్రాయ్ చాపర్ నుంచి సిగ్నల్ వెళ్లినా.. శత్రుసైన్యం కాల్పులు జరిపింది. కొన్ని క్షణాల్లో చాపర్ కూలిపోయింది. ఈ ఘటనలో బల్వంత్రాయ్ సహా అందులో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయస్థాయి సైనిక ఘర్షణల్లో ఓ రాజకీయ నాయకుడు ప్రాణాలు కోల్పోవడం భారతదేశ చరిత్రలో అదే తొలిసారి.