బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 10:11:21

బోయిన్‌పల్లి చౌరస్తా విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌

బోయిన్‌పల్లి చౌరస్తా విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌

కంటోన్మెంట్‌: బోయిన్‌పల్లి చౌరస్తాను ఆనుకుని ఉన్న జీఎల్‌ఆర్‌ సర్వే నెంబర్‌ 569లోని 1.5 ఎకరాల మిలటరీ స్థలాన్ని (ఏ-1) సీ కేటగిరి స్థలంగా మార్చాలని రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు కంటోన్మెంట్‌ బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో బోయిన్‌పల్లి చౌరస్తా విస్తరణ, బాలానగర్‌-బోయిన్‌పల్లి మార్గంలో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుందని ఒకటో వార్డు బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి  వెల్లడించారు. సుమారు  ఏడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం సోమవారం అధ్యక్షుడు బ్రిగేడియర్‌ అభిజిత్‌ చంద్ర నేతృత్వంలో కంటోన్మెంట్‌ బోర్డు సమావేశం జరిగింది. ఈ సాధారణ సమావేశంలో కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి పలు కీలక తీర్మానాలు ఆమోదించింది. కొవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో కేవలం బోర్డు సభ్యులతోనే అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు బోర్డు సభ్యులు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతిపాదించిన 62 రోడ్ల మరమ్మతులకు ఆమోదం తెలపడంతో పాటు,  తాజాగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకూ ప్రత్యేక నిధులు కేటాయించాలని బోర్డు సభ్యులు కోరగా సమావేశం ఆమోదం  తెలిపిందన్నారు. రామన్నకుంట దిగువన ఉన్న రోడ్డును రూ.1.20 కోట్లతో వైట్‌  ట్యాపింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.  దీంతో పాటు ఆ రోడ్డు మార్గంలో రూ.1.50 కోట్లతో మీటరు వ్యాసార్థం కలిగిన ప్రత్యేక డ్రైనేజీ లైను వేయాలన్న సభ్యుల ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు. బస్తీలు, కాలనీల్లో 104 మొబైల్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు కంటోన్మెంట్‌లో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించామని పేర్కొన్నారు.  రిసాల బజార్‌ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.60లక్షల  కేటాయింపు ప్రతిపాదనకు సైతం  బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. అదే విధంగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడో వార్డు పరిధిలో ఎకరం స్థలంలో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ ఏర్పాటుతో పాటు అదే ప్రాంతంలో మరో కమ్యూనిటీ హాలు నిర్మాణ అంశాన్ని పరిశీలించాలని బోర్డు సభ్యులు కోరారని వివరించారు. ఇటీవల వర్షాలకు మంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న శానిటరీ సిబ్బంది సేవల పట్ల అభినందనలు తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించి డెవలప్‌మెంట్‌ చార్జీలు, ఆస్తిపన్ను మ్యూటేషన్‌, హోర్డింగ్‌ల అడ్వర్టయిజ్‌మెంట్‌ చార్జీలు, అప్పీలు ఫీజులను 40 శాతం నుంచి 60 శాతానికి పెంచారు.  దీంతో పాటు పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.