సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 06, 2020 , 23:40:19

మూడు కేంద్రాల్లో.. మూల్యాంకనం

మూడు కేంద్రాల్లో.. మూల్యాంకనం

  • ఇంటర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు 

సిటీబ్యూరో : ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనానికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునివ్వడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  హైదరాబాద్‌ జిల్లాకు మొత్తం 4 లక్షల పేపర్లు వచ్చాయి. వీటిని గన్‌ఫౌండ్రీలోని మహబూబియా బాలికల జూనియర్‌ కళాశాలలో భద్రపరిచారు. ఈ నెల 11 వరకు కోడింగ్‌  పూర్తిచేసి 12 నుంచి మూల్యాంకనం ప్రారంభించనున్నారు. 15 రోజుల్లో వాల్యూయేషన్‌ పూర్తి చేయనున్నారు.  కోడింగ్‌ కోసం 60 మంది సిబ్బంది అవసరమవగా, వారిని గురువారం విధుల్లో చేరాల్సిందిగా ఆదేశించారు.

గదికి 8 మందే..

గతంలో జిల్లాలో ఒకే ఒక్క మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ప్రస్తుతం మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గన్‌ఫౌండ్రీలోని మహబూబియా కళాశాలతో పాటు సుజాత జూనియర్‌ కళాశాల, అబిడ్స్‌లోని సెయింట్‌ జార్జ్స్‌ బాలుర జూనియర్‌ కళాశాలలను ఎంపికచేశారు. మొత్తం 600 మంది అధ్యాపకులు  హాజరుకానున్నారు. ఒక్కో హాల్లో కేవలం 8 మందినే కేటాయిస్తారు. వాల్యూయేటర్లకు థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. 

ఏర్పాట్లు పూర్తి.. 

మూల్యాంకనంపై బుధవారం సమీక్ష నిర్వహించాం. ఇంటర్‌ బోర్డు  ఆదేశాల మేరకు జిల్లాలో  తగు ఏర్పాట్లు చేస్తున్నాం  మరో ఇద్దరు సహాయ క్యాంప్‌ అధికారులను నియమించి మూల్యాంకనాన్ని పూర్తి చేస్తాం.

- జయప్రదాబాయి, డీఐఈవో


logo