హైదరాబాద్ : కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో(Road accident) నవ వధువు(Bride dies) మృతి చెందిన విషాదకర సంఘటన జనగామ జిల్లా(Janagama) నర్మెట మండలం వెల్దండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గూటం యాదగిరి కుమార్తె స్వాతి(26)కి హనుమకొండకు చెందిన తిలక్‌తో ఈ నెల 21వ తేదీ ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో వివాహం జరిగింది.
సోమవారం వధూవరులు, వారి తల్లిదండ్రులు కలిసి హనుమకొండ నుంచి కారులో వేములవాడకు వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లి శివారులో కారు అదుపుతప్పి కల్వర్టు కిందికి దూసుకెళ్లింది.
దీంతో వారు కారులో ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు, పోలీసులు వారిని బయటకి తీసి 108 వాహనంలో అదే రోజు రాత్రి కరీంనగర్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున స్వాతి మృతి చెందింది. కాళ్లపారాణి ఆరకముందే స్వాతి చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.