Supreme Court | ఎలక్టోరల్ బాండ్ల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం మరో పిటిషన్ దాఖలైంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్స్, రాజకీయ పార్టీల అనుబంధానికి సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. కామన్ కాజ్ అనే ఎన్జీవో ఈ పిటిషన్ దాఖలు చేసింది. కార్పొరేట్స్, రాజకీయ పార్టీల మధ్య క్విడ్ ప్రోకోపై విచారణ జరపాలని పిటిషన్లో కోరింది.
షెల్ కంపెనీలు, నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీల నుంచి వివిధ రాజకీయ పార్టీలకు నిధులు అందడంపై విచారణ జరిపేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో ఎన్టీవో కోరింది. అలాగే ఎలక్టోరల్ బాండ్ల డేటా ద్వారా వెల్లడైన వాస్తవాలపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే డబ్బు అక్రమాల ద్వారా సంపాదించినట్లుగా దర్యాప్తులో తేలితే.. ఆయా పార్టీల నుంచి రికవరీ చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌లో కోట్లాది రూపాయల కుంభకోణాన్ని వెలికి తీసేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని కామన్ కాజ్ అండ్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (CPIL) పిటిషన్లో పేర్కొంది.
ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై సిట్ దర్యాప్తు చేయాలన్ని అవసరాన్ని వివరించింది. ప్రతి రూ.వెయ్యి కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లకు, ఆ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలకు కనీసం వంద రెట్లు విలువైన కాంట్రాక్టులు ఇవ్వబడ్డాయని పేర్కొంది. రాజకీయ విరాళాలు ఇస్తున్న షెల్ కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీల ఆర్థిక వనరులపై విచారణ జరిపించాలని కోరారు. సిట్ దర్యాప్తును కోరడంతో పాటు రాజకీయ పార్టీలు క్విడ్ ప్రోకోకు పాల్పడితే.. అక్రమంగా నిధులు ఇచ్చినట్లు తేలితే రికవరీ చేసేలా సూచనలు చేయాలని కోర్టు కోరింది.