Health tips : వర్షాకాలంలో అనేక వ్యాధులు ప్రబలుతుంటాయి. గాలిలో తేమ, చుట్టూ ఉన్న ధూళి లేదా నిలిచిపోయిన నీరు దోమలకు, బ్యాక్టీరియాకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా వైరల్ జ్వరం, జలుబు-దగ్గు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఈ సీజన్లో వైరల్ జ్వరం అత్యంత సాధారణమైనది. అలసట, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు లాంటివి వైరల్ ఫీవర్‌కు ప్రారంభ లక్షణాలు. మలేరియా, డెంగ్యూలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వాటిని కూడా వైరల్ జ్వరాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
డెంగ్యూ, మలేరియా వర్షాకాలంలో వచ్చే అత్యంత తీవ్రమైన జ్వరాలు. డెంగ్యూ దోమలు పగటిపూట కుడుతాయి. మలేరియా వ్యాప్తిచేసే దోమలు రాత్రిపూట కుడతాయి. రెండు సందర్భాల్లోనూ జ్వరం, తలనొప్పి, చలి, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. కాబట్టి వర్షాకాలంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. ఈ సీజన్లో టైఫాయిడ్, నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా వేగంగా వ్యాపిస్తాయి. మురికి నీరు తాగడం లేదా బయట ఉండే ఆహారం తినడంవల్ల కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, బలహీనత, హై ఫీవర్ వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల వానాకాలంలో బయటి ఆహారం తినపోవడం మంచిది. కట్ చేసి ఉంచిన పండ్లు లేదా రోడ్డు పక్కన లభించే చాట్ వంటి ఆహార పదార్థాలు ఇన్ఫెక్షన్కు ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి బయట ఫుడ్ తినకుండా ఇంటి భోజనం తీసుకుంటూ గోరువెచ్చని నీళ్లు తాగండి. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా సర్వసాధారణం. అధిక చెమట, తడిగా ఉన్న బట్టలు ఫంగల్ పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా మెడ, చంకలు లేదా కాలి వేళ్ల మధ్య చర్మం ఒకదానికొకటి తాకే ప్రదేశాలలో ఇన్ఫెక్షన్ త్వరగా సంభవిస్తుంది. కాబట్టి తేలికపాటి దురదను కూడా విస్మరించకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
వర్షాకాలంలో వ్యాధుల బారినపడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. పరిశుభ్రమైన నీరు తాగాలి. తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి. ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. పిల్లలకు పరిశుభ్రత పాటించడం నేర్పాలి. జ్వరం మూడు రోజులైనా తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించాలి. ఇలా పరిశుభ్రత పాటిస్తే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వర్షాకాలం వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.