Parliament : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఇవాళ పార్లమెంట్ (Parliament) కు హాజరయ్యారు. గత వారం విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రధాని.. వర్షాకాల సమావేశాల (Monsoon session) ఆరో రోజైన సోమవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఇవాళ లోక్‌సభ (Lok Sabha) లో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరగనున్న నేపథ్యంలో ప్రధాని రాక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభించనున్నారు. ఈ అంశంపై చర్చ కోసం కేంద్ర సర్కారు 16 గంటల సమయం కేటాయించింది. పదహారు గంటల చర్చ ముగిసిన అనంతరం రక్షణమంత్రి ఆ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఇక రాజ్యసభలో కూడా ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం పెద్దల సభలో చర్చను మొదలుపెట్టనున్నారు.
రాజ్యసభలో కూడా రక్షణ మంత్రే చర్చను ప్రారంభించనున్నారు. రాజ్యసభలో చర్చకు కేంద్రం 9 గంటల సమయం కేటాయించింది. ఆ 9 గంటల చర్చ ముగిసిన అనంతరం రక్షణ మంత్రి సభకు సమాధానం ఇవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్‌పై చర్చలో భాగంగా ఉభయసభల్లో సభ్యులు పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతిగా సైన్యం తీసుకున్న చర్యలు, భారత విదేశాంగ విధానం, రక్షణ విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు.
కాగా ఈ ఏడాది ఏప్రిల్ 22న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నలుగురు జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో మారణహోమానికి పాల్పడ్డారు. మహిళలు, పిల్లలను వదిలేసి పురుష పర్యాటకులే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారత పౌరులు కాగా, ఒక నేపాలీ ఉన్నారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌పై విరుచుకుపడింది. అర్ధరాత్రి మెరుపుదాడి చేసి ఏకంగా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.