Heart Health | ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వాళ్లకు మాత్రమే హార్ట్ ఎటాక్‌లు వచ్చేవి. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారితోపాటు చిన్నారులకు కూడా గుండె పోటు వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు సన్నగా ఉంటారు కానీ వారిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని, లావుగా ఉన్నంత మాత్రాన కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్లు కాదని, సన్నగా ఉన్నవారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా, హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఇందుకు గాను నిత్యం మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
శరీరంలో ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు అధికంగా ఉంటే గుండెకు నష్టం వాటిల్లుతుంది. కనుక ఈ స్థాయిలను తగ్గించుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలి. ఇందుకు గాను పలు ఆహారాలు మనకు దోహదం చేస్తాయి. ఓట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోవచ్చు. హెచ్‌డీఎల్ పెరుగుతుంది. ఓట్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌కు అతుక్కుంటుంది. అది బయటకు వెళ్లేలా చేస్తుంది. కనుక ఓట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె పోటు రాకుండా నివారించవచ్చు. బీన్స్‌ను కూడా ఆహారంలో తినాలి. వీటిల్లో ఉండే ఫైబర్ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పప్పు దినుసులు, శనగలు, పచ్చి బఠానీలు కూడా ఎంతగానో మేలు చేస్తాయి. వీటిల్లోనూ సాల్యుబుల్ ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె పోటు రాకుండా చేస్తుంది. బాదంపప్పు, వాల్ నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటిని రోజూ నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. అవకాడో పండ్లలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకున్నా కూడా ఎల్డీఎల్, ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు.
సాల్మన్, మాకరెల్, హెర్రింగ్, ట్యూనా వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ తింటే ట్రై గ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటే గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. కనుక చేపలను తరచూ తింటుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే పాలకూర జ్యూస్‌ను రోజూ తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె, నైట్రేట్స్ రక్త నాళాలను వెడల్పుగా చేస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించాలంటే బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల వంటి బెర్రీ పండ్లను రోజూ తింటుండాలి. అలాగే అరటి పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను రోజూ తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.