ఎలివేటెడ్ కారిడార్ విషయంలో సర్కార్ రెండు గ్లాసుల విధానాన్ని అమలు చేస్తోంది. ఒక ప్రాంతానికి ఒక రకంగా, ఇంకో ప్రాంతానికి ఇంకో విధంగా పరిహారం చెల్లిస్తోంది. ప్రాంతానికో తీరుగా పరిహారాన్ని నిర్ధారిస్తూ బాధితులను ముప్పు తిప్పలు పెడుతున్నదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే ప్రాజెక్టు విషయంలో రెండు రకాల పరిహారం అమలు చేయడమే ఇప్పుడు బాధితులను ఆందోళనకు గురిచేస్తున్నది. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు విషయంలో పరిహారం వ్యత్యాసం పలు విమర్శలకు తావిస్తున్నది.
– సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ)
పరిహారంలో వ్యత్యాసం
మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్న ప్రాంతాలకు జిల్లా రెవెన్యూ అధికారులు మార్కెట్ విలువపై 7 రెట్లు ఖరారు చేశారు. కానీ ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాకు చెందిన బాధితుల అభ్యర్థనలను సర్కార్ పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం వారితో చర్చలు కూడా జరపలేదు. జిల్లాలవారీగా పరిహారం కట్టబెట్టి మొత్తానికి ప్రాజెక్టుకు భూములు తీసుకునేలా వ్యూహాత్మకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అయితే హైదరాబాద్ జిల్లావాసులు కూడా మార్కెట్ విలువ ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని అడుగుతున్నారు. ఏకరీతిలో పరిహారాన్ని నిర్ధారించకుండా… ప్రాంతాలుగా విభజించి చేయడంతో, తమకు తీరని నష్టం జరుగుతుందని హైదరాబాద్ జిల్లా వాసులు వాపోతున్నారు.

సిటీబ్యూరో, మార్చి 3(నమస్తే తెలంగాణ): జేబీఎస్ నుంచి తూంకుంట వరకు హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో పరిహారం, ప్రాజెక్టు వెడల్పు తగ్గించాలనే ప్రతిపాదనను సర్కార్ పరిగణనలోకి తీసుకోలేదు. బాధితులను ప్రాంతాలవారీగా విభజన చేసి, పరిహారాన్ని కట్టబెట్టి ప్రాజెక్టుకు అవసరమైన భూములను సేకరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో పరిహారాన్ని తొలి దశలో కొంతమందికి విడుదల చేసింది. అదే తరహాలో హైదరాబాద్ జిల్లాలో పరిహారం ఇవ్వకుండా, మార్పులు చేసింది.
డిమాండ్లకు దక్కని ప్రాధాన్యత…
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు వెడల్పును 200 ఫీట్ల నుంచి 120 ఫీట్లకు తగ్గించాలనే డిమాండ్‌కు సంబంధించి ఇప్పటికీ సర్కార్ స్పందించలేదు. కనీసం ఆ విషయంలో ఎందుకు భారీ వెడల్పుతో ఎలివేటెడ్ నిర్మిస్తున్నారనే వివరణ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పరిహారానికి బదులుగా కోల్పోతున్న భూమికి సమానమైన భూమిని ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. కనీసం ఉప్పల్‌లో జరిగినట్లుగా భూసేకరణ పరిహారం తరహాలోనైనా ఇవ్వాలనే ప్రతిపాదన కూడా సర్కారు పక్కనపెట్టింది. కేవలం మార్కెట్ విలువకు రెండింతలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించి హైదరాబాద్ జిల్లా యంత్రాంగం చేతులు దులుపుకొంది. ఇలా పరిహారం నుంచి ప్రాజెక్టు వెడల్పు వరకు బాధితుల అభిప్రాయాలను పరిగణనలోకి కూడా తీసుకోలేదు.
పొంగులేటిని కలిసిన బాధితులు…
ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లాలోని బాధితులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి పరిహారం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. సర్కార్ ఉద్దేశపూర్వకంగా తమకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కనీసం మేడ్చల్ జిల్లా తరహాలో తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వారు మంత్రిని కోరారు.