సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది.. ఏ వర్షం వల్లనో.. ఇంకేదో కార్యక్రమం కారణంగానో కాదు.. సీఎంతో సహా ముఖ్యనేతలు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారన్న కారణంతో కార్యక్రమానికి రెండు గంటల ముందునుంచే ప్రధాన రహదారుల్లో సడన్‌గా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేవలం ముప్పావుగంట ముందే ఈ ఆంక్షలకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. అప్పటికే వేర్వేరు ప్రాంతాల నుంచి బంజారాహిల్స్ తదితర ప్రాంతాలకు ప్రయాణం కొనసాగిస్తున్న వారికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.
మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఆ ప్రాంతాల్లో పోలీసుల హడావిడి, నాలుగుగంటల నుంచి వాహనాల మళ్లింపులు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో నగరవాసి నరకయాతన అనుభవించాడు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు క్యాండిల్ ర్యాలీ చేయడం కోసం ఆ ప్రాంతంలోకి ఎవరిని రానీయకుండా అటువైపు నుంచే వెళ్లకుండా అకస్మాత్తుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పంజాగుట్ట, రాజ్‌భవన్ వైపు వెళ్లే ఎన్టీఆర్మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లై ఓవర్మీదుగా అనుమతించ లేదు.
లక్డీకాపూల్, సెక్రటరియేట్ జంక్షన్, రాణిగంజ్, ఇక్బాల్మినార్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు బారులు తీరి కనిపించాయి. వీకెండ్ కావడంతో పాటు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ మధ్యాహ్నం మూడుంబావుకు ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. పోలీసుల అత్యుత్సాహంతో చాలాచోట్ల అంబులెన్స్‌లకు సైతం దారి దొరకలేదు.
సాయంత్రం ఆరుగంటల సమయంలో సెక్రటరియేట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోవడంతో వాహనదారులు కనీసం ఒక కిలోమీటర్ ప్రయాణం చేయడానికి సుమారు గంట సమయం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సార్‌నగర్ నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు, గ్రీన్‌ల్యాండ్ హోటల్ నుంచి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉంటే ట్రాఫిక్‌జామ్ అయిన ప్రాంతాల్లో ఎక్కడా పోలీసులు కనిపించలేదు. ఆర్టీసీ బస్సులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ముందస్తు ప్రణాళిక లేకుండా హడావిడిగా ట్రాఫిక్ ఆంక్షలపై కొంత సమయంలోనే ప్రకటనలు చేయడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.