మనం తినే ఆహారం ద్వారా మూడ్ సెట్ అయ్యేలా చూసుకోవడం ఇప్పటి ఫుడ్ వెల్నెస్ ట్రెండ్. దాన్నే గట్ బ్రెయిన్ వెల్నెస్ ట్రెండ్ అని కూడా అంటున్నారు. ఇందులో భాగంగా, మెదడు ప్రశాంతంగా, చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడే ఆహారాన్ని తింటారు. అలాగే ఏకాగ్రత అధికమయ్యేందుకూ ఇవి పనికొస్తాయి. అందులో కొన్ని ప్రత్యేక ఆహారాలను దీనికి జత చేశారు. వాటిలో ముందు వరుసలో ఉండేది ప్రొ బయాటిక్ ఫుడ్. పెరుగు, మజ్జిగ, యోగర్ట్, కంబూచా లాంటి పులియ బెట్టిన ఆహారాలు దీని కిందకి వస్తాయి.
తర్వాత ప్రి బయాటిక్ రకం ఈ జాబితాలో ఉంటుంది. అరటి పండు, ఉల్లి, వెల్లుల్లి, ఓట్స్లాంటివి దీని కిందకి వస్తాయి. పాలీ ఫినాళ్లు కూడా ఈ కోవలోకే చేరుతాయి. డార్క్ చాకొలెట్, బెర్రీలు, గ్రీన్ టీ, బీట్రూట్ పొడిలాంటివి పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు సహకరిస్తూ మెదడు సమర్థంగా పనిచేసేందుకు సహకరిస్తాయి. వాల్నట్, చియా గింజలు, చేపల్లాంటివి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను పుష్కలంగా అందిస్తూ శరీరంలో వాపులను అరికడతాయి.
తద్వారా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. గట్-బ్రెయిన్ యాక్సిస్… అనేది మెదడు జీర్ణ వ్యవస్థ మధ్య సాగే అనుసంధాన వ్యవస్థ. ఒత్తిడిగా ఉన్నప్పుడు కడుపులో నొప్పి లేదా అసౌకర్యంగా ఉండటం, లేదా సరైన ఆహారం తీసుకోనప్పుడు మూడ్ సరిగ్గా ఉండకపోవడం లాంటివి దీని కారణంగానే జరుగుతాయి. కాబట్టి మంచి ఆహారం ద్వారా మంచి మూడ్‌ని సంపాదించడమే నేటి ట్రెండ్!