న్యూఢిల్లీ, మార్చి 3: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్‌ను చమురు సంక్షోభంలోకి నెడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది. అయితే అమెరికాకు అండగా ఉంటున్నాయన్న కారణంతో యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా దేశాలనూ లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగుతున్నది. ఇప్పటికే తమ అధీనంలోని హొర్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో భారత్ సహా చాలా దేశాలకు ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరాకు పెద్ద అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం 700 ట్యాంకర్లు జలసంధికి ఇరువైపులా ఆగిపోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
6-8 వారాలకే..
దేశంలోని ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల నిల్వలన్నింటిని కలిపినా 6-8 వారాల అవసరాలకే సరిపోతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది. స్టోరేజీ ట్యాంకుల్లో, పైప్లైన్లలో, నౌకల్లోగల ముడి చమురు 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతుందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్తున్నారు. ఇక రిఫైనరీలు, డిపాజిట్లు, పైప్లైన్లు, ఇతర స్టోరేజీ సదుపాయాల్లో ఉన్న శుద్ధిచేసిన పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఇంధనాలు మరో 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతాయన్నారు. దీంతో యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏంటన్న ఆందోళనలు కలుగుతున్నాయి. భారత్‌లో మంగళూరు, పాడూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక పెట్రో రిజర్వులున్నాయి. వీటిలో దాదాపు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు చేసుకోవచ్చు. కాగా, గంటగంటకూ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తున్నట్టు మోదీ సర్కార్ చెప్తున్నది. అయితే చమురు నిల్వలు అడుగంటితే దేశ ఆర్థిక వ్యవస్థకు సంక్షోభమేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. మరోవైపు అమెరికా, రష్యా, పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి చమురు దిగుమతులపై కేంద్రం దృష్టి పెడుతున్నది.
మళ్లీ రష్యా ఆయిల్ కొనుగోళ్లు?
యుద్ధం నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్ సహా ఇతర దేశాలకు జరుగుతున్న సరుకు రవాణా ముఖ్యంగా ముడి చమురు సరఫరా ఆగిపోయినైట్టెంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చమురు సరఫరాలో 20 శాతం ఈ మార్గం గుండానే నడుస్తున్నది. భారత్‌కు దాదాపు 50 శాతం క్రూడ్, 54 శాతం గ్యాస్ కూడా హొర్ముజ్ ద్వారానే వస్తున్నది. కానీ ఈ జలసంధి అధిక భాగం.. ఇరాన్ అధీనంలోనే ఉండటంతో దాన్నిప్పుడు ఆ దేశం మూసేసింది. ఇది భారత్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నది. అయితే అమెరికా ట్రేడ్ డీల్ ఒత్తిళ్లతో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకున్న భారత్.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మళ్లీ రష్యన్ క్రూడ్‌ను కొనేందుకు వెళ్లవచ్చన్న అంచనాలున్నాయి.
ఆగిన ఖతార్ ఎల్ఎన్జీ
భారతీయ సహజ వాయువు దిగుమతుల్లో ఖతార్‌దే అగ్రభాగం. అయితే ఇరాన్ డ్రోన్ దాడుల దృష్ట్యా గ్యాస్ ఉత్పత్తిని ఆపేసినట్టు ఖతార్ ప్రకటించింది. దీంతో భారత్‌కు వచ్చే గ్యాస్ సరఫరాలో 40 శాతం వరకు తగ్గిపోయినట్టేనని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఏటా భారత్‌కు విదేశాల నుంచి వస్తున్న ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ)లో దాదాపు 27 మిలియన్ టన్నులు ఖతార్ నుంచే వస్తున్నది. ఇది మొత్తం దేశానికయ్యే సరఫరాలో 40 శాతానికి సమానం. ఇక దేశీయంగా విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ, సీఎన్జీ పంపిణీ, వంటగ్యాస్ నెట్‌వర్క్‌లకు ఎల్ఎన్జీ కీలకం. దీంతో ఈ రంగాలకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఖతార్ నిర్ణయం భారత్ సహా, ఇతర ఆసియా దేశాలనూ ప్రభావితం చేయనున్నది.
వృద్ధికి వార్ దెబ్బ

భారత జీడీపీ వృద్ధికి.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు అడ్డంకిగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గట్టిగానే ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఫిచ్ గ్రూప్‌నకు చెందిన బీఎంఐ.. మంగళవారం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. యుద్ధం నేపథ్యంలో పెరిగే చమురు ధర.. భారత్ జీడీపీని అంతకంతకూ తగ్గించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్నాయి. ఇప్పటికే బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్లను దాటేసింది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరల్లో 10 శాతం పెరుగుదల.. భారత జీడీపీని 0.3 శాతం నుంచి 0.6 శాతం వరకు తగ్గించేలా చేయగలదని బీఎంఐ అంచనా వేసింది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుత సంఘర్షణలు ఇంకా పెరిగితే ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)తోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) వృద్ధి అంచనాలూ ప్రభావితం కాగలవన్నది.
ఇప్పటికే అమెరికా సుంకాలతో దేశ ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టింది. దీన్ని పరుగులు పెట్టించడానికి అమెరికాతో ట్రేడ్ డీల్‌కు మోదీ సర్కార్.. విశ్వ ప్రయత్నాలనే చేస్తున్నది. అలాగే ఈయూతోనూ జట్టు కట్టింది. అయితే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు.. ఈ ట్రేడ్ డీల్స్ ప్రయోజనాలను దూరం చేస్తాయని బీఎంఐ అంటున్నది. భారత్‌లో పెట్టుబడులను నిరుత్సాహపర్చగలవని చెప్తున్నది. పెరిగే ముడి చమురు ధరలు.. దిగుమతుల్ని భారం చేస్తాయని, ఇంధన ధరలకు రెక్కలు తొడుగుతాయని, ద్రవ్యోల్బణం విజృంభించి, వడ్డీరేట్లు పెరిగి, కీలక రంగాలకు రుణ లభ్యత కరువై, ఉపాధి అవకాశాలు దూరమై.. ఇలా యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థే ప్రభావితం అవుతుందని ఆర్థిక నిపుణులు సైతం ఇప్పుడు హెచ్చరిస్తున్నారు.