అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలోని సముద్ర జలాలపై సరుకు రవాణాను అత్యంత వ్యయభరితంగా మార్చేస్తున్నది. ఇరువైపుల దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ దేశాలు అల్లకల్లోలంగా మారాయి. అమెరికాకు మద్దతిస్తున్నాయన్న కోపంతో పొరుగు దేశాలపైనా ఇరాన్ దాడులు చేస్తున్నది. ఈ క్రమంలో వాణిజ్య నౌకలనూ వదలడం లేదు. ఇప్పటికే కీలకమైన హొర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటించిన ఇరాన్.. ఆ మార్గంలో ప్రయాణిస్తే దాడులు తప్పవని హెచ్చరించింది. దీంతో దాదాపు సరుకు రవాణా నిలిచిపోగా.. మరికొన్ని నౌకలు దూరమైనా చుట్టూ తిరిగి పోవాల్సి వస్తున్నది. అయితే ఈ భారానికితోడు నౌకలకు మరో సమస్య వచ్చిపడిందిప్పుడు.
పెరుగనున్న బీమా ప్రీమియం
నౌకలకు చేయించే బీమాకు సంబంధించిన ప్రీమియంలు.. యుద్ధం నేపథ్యంలో భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓడతోపాటు అందులోని సరుకులకూ బీమా తప్పనిసరి. వాతావరణం అనుకూలించక లేదా మరేదైనా కారణంతో దురదృష్టవశాత్తు ఓడలు సముద్రంలో మునిగిపోతే నష్టపరిహారం అందుతుంది. అయితే యుద్ధంతో ఇరాన్.. ఓడలనూ లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నది. దీంతో చాలావరకు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయినప్పటికీ రిస్క్ చేస్తూ మరికొన్ని ఇతర మార్గాల్లో వెళ్తున్నాయి. దీనికి తగ్గట్టే బీమా ప్రీమియంలూ పెరిగే వీలున్నదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఫలితంగా యుద్ధం ఇంకా కొనసాగితే అటు నౌకల నిర్వాహకులకు, ఇటు ఎగుమతి/దిగుమతిదారులకు, బీమా సంస్థలకూ నష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. పెరిగే బీమా ప్రీమియంలు.. నౌకలోని సరుకుల ధరలనూ ప్రభావితం చేస్తాయని, దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులపైనా ప్రభావం పడుతుందంటున్నారు.