హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడిందని, పశ్చిమ బెంగాల్- ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఈ తీవ్ర వాయుగుండం గంటకు 3 కి.మీ వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆగస్టు 3 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో పోలీసులు ఐటీ కంపెనీలకు పలు సూచనలు చేశారు. ఉద్యోగులు ముందస్తుగా లాగ్అవుట్ అయ్యేందుకు అనుమతించాలని సూ చించారు. సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసినట్టు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు.