యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య స్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో నేతలు హరీశ్‌రావు, వినోద్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజయ్య తదితరులు
హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): ‘ఏం జేస్తరో చేయండి.. అత్యుత్తమ చికిత్స అందించండి.. దయచేసి మా ‘పెద్ది’ ప్రాణాలు కాపాడండి’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. యశోద హాస్పిటల్ వైద్యులకు విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు సోమవారం సికింద్రాబాద్ యశోద దవాఖానకు వెళ్లారు. ఐసీయూలో బెడ్‌పై అచేతన స్థితిలో ఉన్న ఉద్యమ సహచరుడిని చూసి కేసీఆర్ చలించిపోయారు. కొంతసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం వైద్యులతో కలిసి చికిత్స అందుతున్న తీరును పరిశీలించారు. డాక్టర్లతో మాట్లాడి వైద్యచికిత్సపై ఆరా తీశారు. ఎలాగైనా మా ‘పెద్ది’ని బతికించండి అంటూ వైద్యులకు చేతులెత్తి నమస్కరించారు.
ఆయన చేసిన విజ్ఞప్తికి వైద్యులు ఒక్కసారిగా ఖిన్నులయ్యారు. తప్పకుండా సార్.. అనుక్షణం పర్యవేక్షిస్తూ ప్రపంచస్థాయి చికిత్స అందిస్తున్నాం అని ప్రతిస్పందించారు. గుండె, ఊపిరితిత్తులు, మిగిలిన అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని, కొంత బ్రెయిన్ పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని, అందుకు మరో 48గంటల సమయం పట్టే అవకాశం ఉన్నదని వివరించారు. అవసరం మేరకు అమెరికా సహా ఇతర దేశాల వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ, ఇతర అవసరమైన పరీక్షలు, డాక్టర్ల బృందంతో చర్చిస్తూ సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండీ ఏఎస్ రావు భరోసానిచ్చారు. అయితే పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని వారు వెల్లడించారు.
దేవుడున్నడు.. డాక్టర్లున్నరు.. ధైర్యంగా ఉండండి
పెద్ది ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన తర్వాత ఆయన పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య స్వప్న, కొడుకు నిదర్శన్‌రెడ్డి, కూతురు ధర్మిష్ఠ, సోదరులు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సోదరి స్వాతిని కలిశారు. కేసీఆర్‌ను చూసిన వెంటనే వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ చేతులు జోడించి నమస్కరించారు. కేసీఆర్ సైతం వారిని చూసి చలించిపోయారు. ‘పైన దేవుడున్నడు.. ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నరు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి.. ఆయనకు అత్యుత్తమ చికిత్స అందుతున్నది.. గుండె చెదరొద్దు.. ధైర్యంగా ఉండండి..’ అంటూ వెన్నుతట్టి ఓదార్చారు. పార్టీ తరఫున అన్నివిధాల అండగా ఉంటామని, ఖర్చుకు వెనుకాడకుండా పెద్దిని కాపాడుకునేందుకు శాయశక్తులా కృషిచేస్తామని భరోసానిచ్చారు. తప్పకుండా ఆయన కోలుకొని ప్రజాజీవితంలో తిరిగి కొనసాగుతారని విశ్వాసం వ్యక్తంచేశారు.
అరగంటకు పైగా హాస్పిటల్లోనే..
పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకొనేందుకు కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. 3.20 గంటలకు దవాఖానకు చేరుకున్నారు. సుదర్శన్‌రెడ్డికి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడే ఉండి ఎప్పటికప్పుడూ పరిస్థితులను పర్యవేక్షించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని నిర్దేశించారు. కేసీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాస్పిటల్ ప్రాంగణానికి తరలివచ్చారు. రోగుల బంధువులు కూడా ఆయనను చూసేందుకు ఉత్సాహం చూపారు. ఆవరణలోని బెంచీలు, దవాఖాన బారికేడ్లపై నిలబడి కేసీఆర్‌కు అభివాదం చేశారు. సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. కొందరు యువకులు ‘జై కేసీఆర్.. మళ్లీ మీరే మా సీఎం..’ అంటూ నినదించారు. తరలివచ్చిన నాయకులకు అభివాదం చేస్తూ తన నివాసానికి తిరుగు పయనమయ్యారు.
కేసీఆర్ వెంట బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, మాజీ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, పార్టీ ప్రధాన కార్యదర్శులు గ్యాదరి బాలమల్లు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ముఖ్య నేతలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వై. సతీశ్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, పల్లె రవికుమార్‌గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రజినీ సాయిచంద్, వాసుదేవారెడ్డి, గజ్జెల నగేశ్, చిరుమల్ల రాకేశ్, గోసుల శ్రీనివాస్ యాదవ్, బొమ్మెర రామ్మూర్తి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు. చిత్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తదితరులు

యశోద దవాఖానలో సోమవారం పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్నను ఓదార్చుతున్న కేసీఆర్. చిత్రంలో సత్యవతి రాథోడ్, సుదర్శన్‌రెడ్డి కుమారుడు నిదర్శన్‌రెడ్డి, కూతురు ధర్మిష్ఠ