హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానిలో రియల్టీపై కాంగ్రెస్ సర్కార్ ‘నిషేధిత’ భూతాన్ని వదిలింది. 22ఏ నిషేధిత జాబితా కారణంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని ఉన్న వేలాది కుటుంబాల భవిష్యత్తుపై అంధకారం అలుముకుంటున్నది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడడం నిబంధన 22ఏ లక్ష్యం కాగా, క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఎలాంటి ముందస్తు పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ చేయకుండా ప్రైవేట్ భూములను కూడా అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారు. ఒక పెద్ద లే అవుట్ లేదా సర్వే నంబర్లో ఉండే ఒక చిన్న ప్రాంతానికి ఉన్న సమస్యను, దశాబ్దాల కాలంనాటి రికార్డుల్లో అస్పష్టత ఉన్నా.. ఆ సర్వే నంబర్ పరిధిలోని వందలాది ఎకరాలు, వేలాది ప్లాట్లను, ఇండ్లను ఏకపక్షంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు.
చివరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన హెచ్ఎండీఏ లే అవుట్లలోని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు కాకపోవడం రాజధానిలో రియల్టీ తీరును కండ్లకు కడుతున్నది. రెండు, మూడు నెలలుగా నగర పరిసరాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. బాధితులు బ్యాంకు రుణాలు తెచ్చుకుని, అడ్వాన్స్‌లు ఇచ్చి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే ‘మీ ఆస్తి 22ఏలో ఉంది. రిజిస్ట్రేషన్ కుదరదు’ అని అధికారులు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో బ్యాంకులు మంజూరైన రుణాలను రద్దు చేస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు చెల్లించిన ముందస్తు డబ్బులు తిరిగి రాక, ఆస్తులు చేతికందక నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లల చదువులు, విదేశీ విద్య, వివాహాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సొంత ఆస్తిని అమ్మకానికి పెట్టిన సామాన్యులు నిషేధిత జాబితాలో వారి ఆస్తులను చూసుకుని గుండెలు బాదుకుంటున్నారు. అత్యవసరానికి గుంట భూమి అమ్ముకుందామంటే 22ఏ అడ్డుపడటంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ప్రైవేట్ ఆస్తి అని రెవెన్యూ ఆధారాలు ఉన్నా పహాణీలు, పాత లింకు డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా.. సబ్ రిజిస్ట్రార్లు మాత్రం కలెక్టర్ నుంచి ఎన్వోసీ తెస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని తెగేసి చెప్తున్నారు. కలెక్టరేట్లకు వెళ్తే నెలల తరబడి ఫైళ్లు మూలనపడి ఉంటున్నాయి. సొంత పనులను పక్కన పెట్టి రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగడమే పనిగా మారుతున్నది. ఇదే అవకాశంగా కొంతమంది కిందిస్థాయి రెవెన్యూ అధికారులు ఎన్వోసీల పేరిట ఒక్కో ప్లాట్‌కు రూ. 20-30 వేల వరకు వసూలు చేస్తూ కొత్త దందాకు తెర లేపారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ముడుపులు ఇస్తే తప్ప దరఖాస్తులను ముట్టుకోని పరిస్థితులు సిటీ రియల్టీలో దాపురించాయని వాపోతున్నారు.
రికార్డులు సరిచేయాలి
ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరిట ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో రియల్ ఎస్టేట్ రంగానికి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న అస్పష్ట విధానాలతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది. బిల్డర్లు, రియల్టర్లు, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణ పేరిట ప్రైవేట్ ఆస్తులను వివాదంలో నెట్టడం ఏమాత్రం సరికాదు. రాష్ట్ర సర్కార్, రెవెన్యూ శాఖలు తక్షణమే స్పందించి ప్రైవేట్ పట్టా భూములు, లే అవుట్లను 22ఏ నిషేధిత జాబితా నుంచి మినహాయించాలి. ప్రతి ప్లాట్‌కూ కలెక్టర్ ఎన్వోసీ నిబంధనను ఎత్తివేసి, ఆన్లైన్ ద్వారా రికార్డులు సరిచేయాలి. ప్రైవేట్ ఆస్తులను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– నారగోని ప్రవీణ్‌కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్